రాబోయే ఎన్నికలకు సంబంధించి తెలుగురాష్ట్రాల్లో ఓ జాతీయ చానల్ నిర్వహించిన సర్వేలో సంచలనమైన రిపోర్టు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన వైసిపికి జనాలు అఖండమైన మెజారిటీ కట్టబెట్టనున్నట్లు సర్వేలో స్పష్టంగా కనబడుతోంది. పార్లమెంటు ఎన్నికలపై చానల్ నిర్వహించిన సర్వేలో మొత్తం 25 సీట్లకు గాను వైసిపికి 21 స్ధానాలు వస్తాయని తేలింది. అధికార తెలుగుదేశంపార్టీకి మిగిలిన నాలుగు సీట్లు వస్తాయట. జనసేన, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు గుండుసున్నాయేనట.
మొత్తం ఓట్ల షేర్ తీసుకుంటే వైసిపికి 41.9 శాతం వస్తుందని సర్వే అంచనాలో తేలింది. టిడిపికి 31.4 శాతం, బిజెపికి 12.5 శాతం, కాంగ్రెస్ కు 7.2 శాతం, జనసేన, సిపిఐ, సిపిఎం కూటమికి 7 శాతం ఓట్లు వస్తాయట. రాష్ట్రంలోని నిరుద్యోగులు ప్రభుత్వంపై బాగా మండిపోతున్నట్లు సర్వేలో స్పష్టంగా బయటపడినట్లు సర్వే చెబుతోంది. ఆమధ్య ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో కూడా 43 శాతం జనాలు జగన్మోహన్ రెడ్డినే తదుపరి ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నట్లు స్పష్టమైన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
తాజా సర్వే కూడా సి ఓటర్, రిపబ్లిక్ టివిలు సంయుక్తంగా నిర్వహించాయి. ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే అనే ప్రాతిపదికన పై సంస్ధలు సర్వే నిర్వహించాయి. అయితే మొన్నటి ఇండియా టుడే సర్వేతో పోల్చుకుంటే తాజా సర్వేలో వైసిపికి 2 శాతం ఓట్లు తగ్గినట్లు అర్ధమవుతోంది. అంటే, సర్వేలో వచ్చినట్లే రేపటి ఎన్నికల ఫలితాలు ఉంటాయన్న గ్యారెంటీ ఏమీ లేదులెండి. కాకపోతే జనాలు తమ పార్టీ పట్ల ఏ అభిప్రాయంతో ఉన్నారు అనేందుకు ఇదొక శాంపుల్ గా ఉపయోగపడుతుంది. ఇక, తమను తాము ఎంతో గొప్పగా ఊహించుకుంటున్న బిజెపి, కాంగ్రెస్, జనసేనలు వచ్చే ఎన్నికల్లో జనాలు భారీ షాక్ ఇస్తారనే సంకేతాలు అందుతున్నాయనే అనుకోవాలి.