ఈనెల 6వ తేదీన ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్ జరిపేందుకు కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్ణయించింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని ఎలక్షన్ కమీషన్ కు తెలియజేసింది. ఏప్రిల్ 11వ తేదీన జరిగిన పోలింగ్ సందర్భంగా చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో గొడవలు జరిగిన విషయం తెలిసిందే.
పై జిల్లాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో జరిగిన అల్లర్లను, హింసను ఎలక్షన్ కమీషన్ కేంద్ర ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకెళ్ళారు. రీ పోలింగ్ జరపాల్సిన అవసరాన్ని వివరించారు. అయితే ఇన్ని రోజులు నివేదికలను పరిశీలించిన తర్వాత సీఈసీ ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్ జరపాలని నిర్ణయించింది. జరిగిన అల్లర్లను, ఈసి ఇచ్చిన నివేదిను పూర్తిస్ధాయిలో సీఈసీ ఆమోదించినట్లు లేదు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలోని బూత్ 94 పోలింగ్ కేంద్రం, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 244, నెల్లూరు జిల్లా కోవూరు పోలింగ్ కేంద్రం 41, సూళ్ళూరుపేట పోలింగ్ కేంద్రం 97, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 197లో మాత్రం రీ పోలింగ్ జరపాలని నిర్ణయించటం గమనార్హం.
చిత్తూరు జిల్లాలోని తంబళ్ళపల్లి నియోజకవర్గంలో వైసిపి కార్యకర్త చనిపోయారు. అలాగే పూతలపట్టు నియోజకవర్గంలో ఏకంగా వైసిపి అభ్యర్ధి బాబుపైనే దాడి జరిగింది. అనంతపురం జిల్లాలోని గుంతకల్లు నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన జనసేన అభ్యర్ధి మధుసూదనగుప్త ఈవిఎంనే ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా కొన్ని ఈవిఎంలు ధ్వంసం అయ్యాయి. మరి ఆ కేంద్రాల్లో రీ పోలింగ్ కు ఎందుకు అనుమతించలేదో అర్ధం కావటం లేదు.