రెడ్ డైరీ రాజకీయం… ఏపీలో కొడుకు – తెలంగాణలో శిష్యుడు!

ఈమధ్యకాలంలో పోలీసులను హెచ్చరించడం, బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయినట్లుంది. ఎవరి రక్షణ లేకపోతే బాత్ రూం లో కూడా ఆందోళనతో గడుపుతారో అలాంటి కొంతమంది నేతలు సైతం పోలీసుల వలయంలోనే ఉంటూ… వారిపైనే అవాకులూ చెవాకులూ పేలుతున్నారు. పైగా ఇప్పుడు అది పెద్ద ట్రెండ్ అయినట్లు కనిపిస్తోంది.

అవును… ఏపీలో ప్రతిప‌క్ష నేత చంద్రబాబు కుమారుడు, తెలుగుదేశం పార్టీ యువ‌నేత నారా లోకేష్ అధికార పార్టీ త‌మ‌కు స‌హ‌క‌రించ‌ని అధికారుల పేర్లు రెడ్ డైరీ లో రాసుకుంటున్నాన‌ని చెప్పుకుంటున్నారు. తన యువగళం పాదయాత్రలో భాగంగా అది చేత్తోపట్టుకుని తిరుగుతున్నారు. తాము అధికారంలోకి వ‌చ్చాక అంద‌రి లెక్కలు స‌రిచేస్తామ‌ని చెబుతున్నారు.

ముఖ్యంగా పోలీసుల పేర్లే ఇందులో ఉంటాయ‌ని యువ‌గ‌ళం పాద‌యాత్రలో ప‌దే పదే చెబుతున్నారు నరా లోకేష్. ఇందులో భాగంగా తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ శ్రేణులు అల్లర‌కు దిగ‌కుండా పోలీసులు క‌ట్టడి చేసినందుకు.. అక్కడ ఎస్పీ రిషాంత్‌ రెడ్డిపై లోకేష్ అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. “రిషాంత్‌ రెడ్డి పేరే రెడ్ డైరీలో మొద‌టిద‌ని” ఓ వార్నింగ్ కూడా ఇచ్చేశారు.

“సరైన పోలీసోడు దొరకలేదు.. సరైనోడు దొరికితే &%$#@ కారుద్ది” అంటు పోకిరీ సినిమాలోని డైలాగ్ తో ఈ విషయంపై ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. పోలీస్ అధికారులపై ఇలా అవాకులూ చెవాకులూ పేలడ్దం ఏంటని ప్రజాస్వామ్య వాదులు ఫైరవుతున్నారు. ఇది సరైన సంస్కృతి కాదని అంటున్నారు. ఇదే సమయంలో గతంలో టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను గుర్తూ చేస్తున్నారు.

కుప్పం నుంచి పార్టీ నేత నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కోసం అచ్చెన్నాయుడు సహా పార్టీ నేతలంతా కుప్పం చేరుకున్నారు. ఆ సమయంలో సభలో మాట్లాడుతూ పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసారు. 500 మంది పోలీసులతో భద్రత కల్పించామని పోలీసులు చెప్పటం పైన అచ్చెన్న స్పందించారు. “ఎందుకు &%$#@ తినడానికి వచ్చారా అని అడుగుతున్నాను” అంటూ అసభ్య పదజాలం వాడారు!

ఈ సమయంలో తాజాగా తెలంగాణ టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇదే పనిలో ఉన్నారు. “అన్నీ గుర్తుపెట్టుకుంటా, పోలీసుల తప్పులన్నీ రెడ్ డైరీలో రాసుకుంటున్నా.. అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా తిరిగి చెల్లిస్తా” అంటూ మహబూబ్ నగర్ జిల్లా పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. దాన్ని సీరియ‌స్‌ గా తీసుకున్న పోలీసులు రేవంత్‌పై ఫైర్ అయ్యారు. అక్కడితో ఆగ‌కుండా పలు సెక్షన్ల కింద కేసులు కూడా పెట్టారు.

కాగా… రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడైనప్పటికీ చంద్రబాబు శిష్యుడేన‌న్నది రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌ల‌మైన అభిప్రాయం. ఓప‌క్క చంద్రబాబు కుమారుడు ఏపీలో రెడ్ డైరీలో పేర్లు రాస్తున్నానంటూ పోలీసుల అధికారుల‌ను బెదిరించే ప్రయ‌త్నం చేస్తుంటే.. ఇక్కడ రేవంత్‌ రెడ్డి కూడా అదే స్ట్రాట‌జీ ఫాలో అవుతుండటం పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌ లో హాట్ టాపిక్‌ గా మారింది. ఇదంతా చంద్ర‌బాబు స్కూల్ విధానం అంటూ కామెంట్లు పడుతున్నాయి!