మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రైవేటీకరణ వెనుక ‘క్విడ్ ప్రో కో’ (నీకిది.. నాకది..) వ్యవహారం వుందని ఆరోపించారు సబ్బం హరి. ఆంద్రపదేశ్ ప్రభుత్వానికి తెలియకుండా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి అన్నీ తెలుసనీ, అందుకే భూముల అమ్మకాల ప్రతిపాదనను వైఎస్ జగన్ తెరపైకి తెచ్చారనీ సంచలన వ్యాఖ్యలు చేశారు సబ్బం హరి. మొత్తంగా ప్రజా ప్రతినిథులంతా రాజీనామా చేస్తే తప్ప, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదనీ, పోస్కోతో ముఖ్యమంత్రి సంప్రదింపులు.. కేంద్రం ఆలోచనలకు తగ్గట్టుగానే జరిగాయని సబ్బం హరి చెప్పుకొచ్చారు. అయితే, ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భం కానే కాదు. ముఖ్యమంత్రి సహా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులూ ఒక్కతాటిపైకి వస్తే తప్ప, విశాఖ ఉక్కు విషయంలో రాష్ట్ర హక్కుని కాపాడుకునే పరిస్థితి వుండదు.
ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దన్న పాత్ర పోషించి, అన్ని రాజకీయ పార్టీలనూ ఒక్కతాటిపైకి తెచ్చి, ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి, ఓ బృందాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్ళాల్సి వుంది. కానీ, రాష్ట్రంలో రాజకీయాల గురించి అందరికీ తెల్సిందే. చంద్రబాబు హయాంలో పోస్కో సంస్థ, కేంద్రం ముందు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదన చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అప్పట్లోనే స్టీలు ప్లాంటు యాజమాన్యాన్ని పోస్కో బృందం కలిసినట్లుగా కేంద్రం చెబుతోంది. ఆ తర్వాత వైఎస్ జగన్ హయాంలో ఈ పక్రియ మరింత వేగవంతమయినట్లుగా కేంద్రం చెబుతున్న లెక్కల్ని బట్టి అర్థమవుతోంది. ‘రాష్ట్రంతో విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధమే లేదు’ అని కేంద్రం చెప్పేసిన దరిమిలా, రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం కేంద్రం ఎందుకు పరిగణనలోకి తీసుకుంటుంది.? ఇంత నిర్లక్ష్యంగా కేంద్రం చెబుతోందంటే, రాష్ట్రమంతా ఒక్కటై కేంద్రాన్ని నిలదీస్తే తప్ప.. ప్రయోజనం వుండదన్నమాట. ఏది ఏమైనా ఒకప్పుడు వైఎస్ జగన్‌కి అత్యంత సన్నహితుడిగా మెలిగిన సబ్బం హరి, ఆ తర్వాత జగన్‌కి బద్ధ శతృవుగా మారిపోయారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టకుని జగన్‌ని కలిసేందుకు ప్రయత్నించాలి తప్ప, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిని వివాదాల్లోకి లాగి రాజకీయ రచ్చ చేస్తే ఎవరికి ప్రయోజనం అన్నది మాజీ ఎంపీ గుర్తెరగాలి.