పవన్ కళ్యాణ్‌కీ కొన్ని భయాలున్నాయ్.!

తానెవరికీ భయపడనని చెప్పుకునేటోడే ఎక్కువగా భయపడుతుంటాడనేది పెద్దలు చెప్పిన మాట.! మరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంగతేంటి.? ఆయనా మనిషే కదా.! ఆయనకీ భయాలుంటాయ్. కాకపోతే, భయాల్లేనట్టు వ్యవహరిస్తుంటారంతే. నటుడు కాబట్టి, అది ఆయనకు తేలికే.

ఇంతకీ, దేనికి భయం.? ఇంకెందుకు.? 2014లో జనసేన పార్టీ పుట్టింది. 2019 ఎన్నికల్లో చావు దెబ్బ తినేసింది. 2024 ఎన్నికల్లో ఏమవుతుందో తెలియదు. సో, ఈసారి రిస్క్ చేయలేకపోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ‘గతంలోలా బలిపశువునవ్వాలనుకోవడంలేదు..’ అని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

టీడీపీ అవసరం జనసేనానికి వుంది. తాను గెలవడంతోపాటు, పది మందినో పాతిక మందినో.. వీలైతే ఇంకాస్త ఎక్కువ మందినో అసెంబ్లీకి తీసుకెళ్ళడం పవన్ కళ్యాణ్ తక్షణ కర్తవ్యం. నలుగురైదుగురు పార్లమెంటుకీ జనసేన తరఫన వెళ్ళాలని జనసేనాని కోరుకుంటున్నారు.

గెలవడం సంగతి తర్వాత.. రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల్లో పవన్ కళ్యాణ్ మీద కూడా అవినీతి మరక పడితేనో.? అంతకన్నా చావు దెబ్బ ఇంకోటుండదు.? పవన్ కళ్యాణ్‌ని అరెస్టు చేసేంత రిస్క్ వైసీపీ సర్కారు తీసుకోకపోవచ్చు.

కానీ, రాజధాని కుంభకోణంలో పవన్ కళ్యాణ్ కూడా లబ్దిదారు.. అని కేసు పెట్టగలదు. ఆ దిశగా ఇప్పటికే వైసీపీ అనుకూల మీడియాలో కథనాల్ని చూస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భయపడి తీరాలి.! ఎందుకంటే, చంద్రబాబే జైలుకెళ్ళి, బయటకు రాలేకపోతున్నారాయె.!