క్యాబినెట్ కోసం ఇందుకేనా పట్టుబడుతున్నది ?

చంద్రబాబునాయుడు క్యాబినెట్ సమావేశం కోసం ఎందుకింతగా పట్ట పడుతున్నారు ? మొదట్లో ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఎన్నికల కమషన్ పై పంతంతోనే అని అందరూ అనుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ చంద్రబాబు ప్లాన్ ఇపుడు బయటపడుతోంది. క్యాబినెట్ సమావేశం వెనుక రెండు కారణాలున్నట్లు సమాచారం. పెండింగ్ లో ఉన్న ఆర్దిక అంశాలన్నింటినీ క్లియర్ చేసుకోవటమే చంద్రబాబు ప్రధాన ఉద్దేశ్యంగా చెబుతున్నారు. మరి చంద్రబాబు పట్టుదల విషయంలో కేంద్ర ఎన్నికల కమీషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

ఉపాధిహామీ పథకం పనుల తాలూకు పెండింగులో ఉన్న బిల్లులను క్లియర్ చేయించుకోవాలన్నది అసలు కారణం. ఎందుకంటే, ఉపాధిహామీపథకంలో పెండింగులో ఉన్న బిల్లుల మొత్తం సుమారు రూ. 2 వేల కోట్లుగా తేలింది. ఈ పనులన్నీ పుత్రరత్నం నారా లోకేష్ ఆధ్వర్యంలోని పంచాయితీ రాజ్ శాఖ పరిధిలోనే ఉన్నాయట. పైగా కాంట్రాక్టు చేసిందంతా దాదాపు టిడిపి నేతలే. అందరూ కలిసి లోకేష్, చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు.

ఇక రెండో కారణం పోలవరం పనుల్లో నిలిచిపోయిన బిల్లులు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్ట్ సంస్ధ ట్రాన్స్ ట్రాయ్ టిడిపి ఎంపి రాయపాటి సాంబశివరావుదే అన్న విషయం అందరికీ తెలిసిందే.  ఈ సంస్ధ చేయాల్సిన పనుల్లో కొన్నింటిని సబ్ కాంట్రాక్టు ఇచ్చింది. సబ్ కాంట్రాక్టర్లేమో పనులు చేసి బిల్లులడుగుతుంటే ట్రాన్స్ ట్రాయ్ ఇవ్వటం లేదు. సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన సుమారు రూ 420 కోట్లను ట్రాన్స్ ట్రాయ్ వసూలైతే చేసేసుకుంది.  

డబ్బుల కోసం సబ్ కాంట్రాక్టర్లు ఒత్తిడి చేస్తున్నా ట్రాన్స్ ట్రాయ్ చేతెలెత్తేసింది. దాంతో వాళ్ళంతా చంద్రబాబుపై ఒత్తిడి మొదలుపెట్టారట. సబ్ కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులను ప్రభుత్వంతోనే చెల్లింపులు చేయించేట్లుగా చంద్రబాబు ప్లాన్ చేశారట. ఆ మేరకు ఫైళ్ రెడీ చేయమని చెప్పారట. అంటే ట్రాన్స్ ట్రాయ్ చెల్లించాల్సిన బిల్లులను ప్రభుత్వమే సబ్ కాంట్రాక్టర్లకు చెల్లించటానికి రెడీ అయ్యింది.

మరి ట్రాన్స్ ట్రాయ్ తీసుకున్న డబ్బులను వాపసు తీసుకోవాలి కద ? చంద్రబాబు ఆ పనిమాత్రం చేయటం లేదు. అంటే ఆ డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్ళింది ? అందుకే క్యాబినెట్ సమావేశం పెట్టించి బిల్లులను ప్రభుత్వం నుండే చెల్లించేట్లు తీర్మానం చేయించాలన్నది చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే ఆర్ధికశాఖ అంగీకరించటం లేదని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.