ఏపీ సర్కార్ నిర్వాకంతో బ్యాంకులకు కొత్త కష్టాలు.. ఏం చూసి ఇస్తున్నారంటూ?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ సంక్షేమ పథకాల అమలు కోసం అప్పులపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్బీఐ తాజాగా బ్యాంకులు అప్పులు ఇస్తున్న తీరు విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. 2015లో ఆర్బీఐ జారీ చేసిన సర్క్యులర్ కు భిన్నంగా రుణాలు ఇస్తున్న బ్యాంకుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్బీఐ రూల్స్ తో ఇచ్చిన రుణాలను పోలుస్తూ నివేదిక సమర్పించాలని ఆర్బీఐ ఆదేశించడం గమనార్హం.

ఆర్బీఐ ఏపీ పేరును ప్రస్తావించకపోయినా ఈ విధంగా అప్పులు చేస్తున్న ప్రభుత్వాలలో ఏపీ ఒకటి కావడంతో ఏపీ అప్పులు వివాదాస్పదం అవుతున్నాయి. కేంద్రం అనుమతి లేకుండా అప్పులు తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఒకవేళ కేంద్రం అనుమతి తీసుకుంటే ఆ అప్పులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి జగన్ సర్కార్ రుణాలు తీసుకుంటున్న పరిస్థితులు సైతం ఉన్నాయి.

కార్పొరేషన్ల సహకారంతో ఏపీ సర్కార్ దొడ్డిదారిన రుణాలు తీసుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదాయం పెరిగే మార్గాలపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టకుండా కార్పొరేషన్లు చేసే అప్పులకు సైతం ఏపీ ఏపీ సర్కార్ బడ్జెట్ నుంచి కేటాయించాల్సి వస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సర్కార్ అప్పుల విషయంలో తప్పటడుగులు వేస్తోందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఆదాయ పరిమితిని దాటి అప్పులు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. రిజర్వ్ బ్యాంక్ నుంచి బ్యాంకులకు హెచ్చరికలు జారీ అవుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ అప్పులను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తే మంచిదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వమే అప్పులు తెచ్చుకుని ప్రభుత్వమే ఖర్చు చేయడం సరికాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.