‘అరవింద సమేత’ సినిమా మీద నిరసన తెలిపేందుకు హైదరాబాద్ కు వచ్చిన రాయలసీమ ఉద్యమ యువకులు ఒక ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అందులో ఒకరు చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ‘అరవింద సమేత’ సినిమాలో రాయలసీమ యాస, భాష, జీవన శైలిని కించపరిచేలా చూపించారని సీమ యువకులు కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సినిమా రిలీజ్ ఈ ప్రాంతంలో నిరసన వెల్లువ సృష్టించింది. దీని మీద తమ ఆందోళనను వారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దృష్టికి కూడా తీసుకెళ్లారు.
ఈ క్రమంలో వారు కొంత మంది అనంతపురం జిల్లాకు చెందిన యాక్టవిస్టు యువకులు కొందరు నిన్న హైదరాబాద్ వచ్చి సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన నిరసన వెలిబుచ్చారు. రాయలసీమ ప్రజలు రక్తం రుచి మరిగినవా ళ్లుగా, అక్కడి సమాజం చీటికి మాటికి చంపుకునే హంతక సంస్కృతి ఉన్నట్లుగా చూపించడం పట్ల ఈ యువకులు అభ్యంతరం చెప్పారు. అయితే, తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనకు సంబంధించి బాధితులు చెప్పిన మరిన్ని వివరాలు కింద చదవండి.
‘అరవింద సమేత’ సినిమాలో రాయలసీమ భాష, జీవన శైలిని అభ్యంతరకరంగా వాడటంతో వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ దర్శకుడు త్రివిక్రమ్ ని కలిశారు. మీడియాతో కూడా మాట్లాడారు. తిరుగు ప్రయాణంలో కర్నూల్ దాకా వెళ్లారు.
అయితే, టివి9 ఛానల్ వారు ఇంటర్వ్యూ చేస్తామని చెప్పటంతో వారు కర్నూల్ నుంచి హైదరాబాద్ వెనుదిరిగారు, ఇలాహైదరాబాద్ వస్తున్నపుడు మహబూబ్ నగర్ జిల్లాలో మూసాపేట మండలం జానంపేట వద్ద వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో జలం శ్రీను అనే యువకుడు మరణించాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రవి, రాజా, కృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు నంబర్ ap02 cb 4101. వర్షంలో కారు స్లిప్ కావడంతో ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.
గాయపడ్డ వారిని గచ్చి బౌలి కేర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు సోమవారమే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి రాయలసీమ భాష, జీవనశైలిని వ్యంగ్య పరిచారని మరిచిపోయిన ఫ్యాక్షనిజాన్ని గుర్తు చేసి తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.