ఎంపీ అంటే జంపే… వైసీపీలో ఏమి జరుగుతుంది?

సాధారణంగా ఏ పార్టీలో చేరినా.. ఒక నాయకుడు కోరుకునేది ముందుగా టిక్కెట్. అది అసెంబ్లీ అయినా, లోక్ సభ అయినా.. తనకు పార్టీ టిక్కెట్ దక్కితే చాలని భావిస్తుంటారు. ఇక ఒకసారి గెలిచిన అనంతరం చాలా మంది నేతలు ఎమ్మెల్యేలుగానే ఎన్నికవ్వాలని భావిస్తుంటారని చెబుతుంటారు. ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నవారు మాత్రమే ఎంపీగా వెళ్లాలని ఉత్సాహం చూపిస్తారనే ఆరోపణ కూడా రాజకీయాల్లో ఉంది!

ఈ సమయలో ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పులకు శ్రీకారం చుట్టారు. సర్వేల ఫలితాలు, సామాజిక సమీకరణలు మొదలైన అంశాలను ప్రాతిపదికగా తీసుకుని.. పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు చేపట్టారు. ఈ సమయంలో కొంతమంది నేతలు అలిగి బయటకు వెళ్లిపోయారు.

అలా ఆశించిన చోట టిక్కెట్ దక్కలేదనో.. అసెంబ్లీ టిక్కెట్ అడిగితే పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చారనో పార్టీ మారిన నేతల్లో కొంతమంది ఏ పార్టీలో ఉన్నారో తెలియక పోగా.. కొంతమంది మాత్రం మనుగడ కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో ప్రధానంగా… లోక్ సభ కు పోటీ చేయాలని ఆదేశించిన నేతలు ఎక్కువగా పార్టీని వీడటం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అవును… ఏపీలో ఎంపీ టిక్కెట్ ఇస్తామంటే జంప్ చేసే పనికి పూనుకుంటున్నారు వైసీపీ నేతలు. ఈ క్రమంలో ఇప్పటికే తిరుపతి ఎంపీ సీటు ఇస్తే.. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కాలదన్నుకున్న పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో, ఏ స్థానం నుంచి పోటీ చేస్తున్నారనేది తెలియడం లేదు! ఇదే క్రమంలో… కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరుకు టిక్కెట్ ఇస్తే ఆయన కూడా వద్దన్నారు.

ఈ క్రమంలో తాజాగా అమలాపురం ఎంపీ టిక్కెట్ ఇస్తే… జనసేన నుంచి వైసీపీలో చేరిన రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. దిక్కార స్వరం టైపులో తన వెర్షన్ ని వినిపించారు. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పలేకపోయినా.. అలా ఇలా తిప్పి అసలు విషయం చెప్పారు. తనకే ఇవ్వాలని కోరడం లేదు కానీ.. తాను తప్ప మరొకరు గెలవరు అనే టైపులో రాపాక మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

వాస్తవానికి స్థానికంగా రాజోలు నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ పై కొంత వ్యతిరేకత ఉందనే చర్చ జరుగుతుంది. పైగా ఒక వర్గం ఆయనపై పూర్తి వ్యతిరేక్తతో ఉందని అంటున్నారు. ఈ క్రమంలో… ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావుకి రాజోలు టిక్కెట్ కన్ ఫాం చేశారు! దీంతో రాజోలు వైసీపీకి కొత్త బలం తోడయ్యిందనే చర్చ నియోజకవర్గంలో మొదలైంది.

రాజోలులో వైసీపీకి ఉన్న బలానికి తోడు ఇప్పుడు గొల్లపల్లి వ్యక్తిగత చరిష్మా కూడా తోడవ్వడంతో పాజిటివ్ ఫలితాలు వస్తాయని అంటున్నారు. పైగా… ఎస్సీ, బీసీ, కాపు సామాజికవర్గ ప్రజానీకంలో గొల్లపల్లికి వ్యక్తిగత ఇమేజ్ కూడా బాగానే ఉందని.. పార్టీలకు అతీతంగా ఆ ఓట్లు ఆయనకు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సమయంలో రాపాక ఇలా దిక్కార స్వరం వినిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.