ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు మార్గదర్శి చిట్ ఫండ్ కేసుకు సంబందించి ఆ కేసులో ఏ-1 అయిన రామోజీరావును విచారిస్తున్నప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక ఫోటో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తీవ్ర అస్వస్థతతో, నడుముచుట్టూ బెల్టు పెట్టుకుని ఉన్న రామోజీరావు.. మంచానికి పరిమితమైనట్టు ఆ ఫోటో ద్వారా తెలుస్తోంది. ఆ ఫోటో బయటకు రాగానే… నిమిషాల వ్యవధిలో వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా… చంద్రబాబు నాయుడు సైతం ఆ ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అనంతరం డిలీట్ చేశారు.. దీంతో ఆ ఫోటో కంటే ఇప్పుడు ఈ డిలీట్ అంశం హాట్ టాపిక్ గా మారింది.
“మాకు అత్యంత ఆప్తులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు అనారోగ్యానికి గురయ్యారు.. వారు త్వరగా కోలుకోవాలని మా కుల దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు. దీంతో రామోజీరావుకు ఏమైంది అనే ఆరా మొదలైంది? మరికొంతమందైతే… రామోజీకి సీరియస్ గా ఉందా? అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో… జగన్ దెబ్బకి రామోజీ బెడ్ ఎక్కాడంటూ ఇంకొందరు వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు.
ఈ కామెంట్ల సంగతి అలా ఉంచితే… రామోజీ లాంటి వ్యక్తి సీఐడీ విచారణ వల్ల, జగన్ వల్ల అనారోగ్యానికి పాల్పడితే… దాన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలో బాబుకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేసి మరీ.. సానుభూతి సంపాదించుకునేవారు. లేకపోతే.. జగన్ వ్యవహారశైలి ఇది.. అంటూ నిప్పులు చెరిగేవారు. కానీ… అవేమీ చేయకుండా… ఆ ఫోటోను – దానికింద పెట్టిన కామెంట్ ని వెంటనే డిలీట్ చేసేశారు చంద్రబాబు. అయితే.. రామోజీరావు కాంపౌండ్ నుంచి హెచ్చరికలు రావడంతోనే ఆ ట్వీట్ తొలగించాడనే కామెంట్లూ వినిపిస్తున్నాయి!
అయితే… సీఐడీ అధికారులు విడుదల చేసినట్లు చెబుతున్న రామోజీరావు ఫోటోలు… ఒక ప్లాన్ ప్రకారమే బయటకు వచ్చాయని అంటున్నారు విశ్లేషకులు. ఫలితంగా.. సిఐడి విచారణకు భయపడిపోయి మంచం ఎక్కిన రామోజీరావు అని అర్థం వచ్చేలా చేయ తలచారంట. దానికి తోడు.. రామోజీపై భక్తిని చాటుకునే క్రమంలో చంద్రబాబు నాయుడు కూడా.. రామోజీరావు ఫోటోను ట్వీట్ చేయడంతో జగన్ పాచిక పారిందని అంటున్నారు. ఏది ఏమైనా.. మార్గదర్శి విషయంలో రామోజీ & కో ఇరుకునపడ్డారని అంటున్నారు విశ్లేషకులు.