బిగ్ న్యూస్… మార్గదర్శి త్వరలో బోర్డు తిప్పేయబోతోందా?

ప్రస్తుతం ఏపీ సీఐడీ మార్గదర్శిలో అక్రమాలు జరుగుతున్నాయని.. వాటిపై పూర్తి దృష్టి సారించి అవిరమంగా దర్యాప్తు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇందుగలదు అందులేదను సందేహం వలదు ఎందెందు వెదికినా అందందు కలదు అన్నట్లుగా అన్ని బ్రాంచ్ ల పరిస్థితీ అలానే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో మార్గదర్శి చిట్ ఫండ్ ఆఫీసులను తాత్కాలికంగా మూతేసినట్లు తెలుస్తోంది.

అవును… మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలోని అక్రమాలపై దాడులు చేస్తున్న సీఐడీ తదితర ఉన్నతాధికారుల బృందాల తనిఖీల కారణంగా సంస్థ పలు కీలక బ్రాంచిలను మూసేసినట్లు సమాచారం. మార్గదర్శికి రాష్ట్రంలో 37 బ్రాంచిలుండగా.. గురువారం నుండి అన్నీ బ్రాంచీలలో అధికారుల బృందాలు సోదాలు మొదలుపెట్టాయి.

ఈ క్రమంలో ఈ సోదాలు మరో రెండు మూడు రోజులు జరిగే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే సోదాలు జరిగినన్ని రోజులు చందాదారులను బ్రాంచిల్లోకి అనుమతించే అవకాశాలు లేవు. ఇదే సమయంలో సిబ్బందిని కూడా విచారిస్తున్నారు కాబట్టి రెగ్యులర్ ఆఫీసు పనులు కూడా ఏమీ జరగవనే అనుకోవాలి.

ఈ సమయంలో ఒక మీడియా సంస్థ కీలక విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా… తనిఖీలకు వెళ్ళిన అధికారుల బృందాలకు చాలా బ్రాంచీలలో పెద్దఎత్తున ప్రతిఘటన ఎదురైందని.. అలాగే తనిఖీల్లో చందాదారుల సంతకాలను పోర్జరీ చేసిన విషయం బయటపడిందని తెలిపింది.

అంతకంటే ముఖ్యంగా… చందాదారులకు తెలియ‌కుండా వాళ్ళపేరుతో యాజమాన్యమే చిట్టీలను పాడేసుకుని చందాదారుల సంతకాలతో డబ్బులు తీసేసుకున్నట్లు బయటపడిందని ఒక ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది. ఫలితంగా తాజా తనిఖీల్లో మార్గదర్శి ఆర్థిక పరిస్థితిలోని డొల్లతనం బయటపడిందని చెప్పింది.

ఇదే క్రమంలో సంస్థ బ్యాంకు ఖాతాల్లో అసలు డబ్బులే లేవని.. తొందరలోనే మార్గదర్శి బోర్డు తిప్పేయటం ఖాయమని సదరు మీడియా సంస్థ సంచలన విషయాలు వెల్లడించింది. దీంతో ఫోర్జరీలు చేసిన చిట్టీల పాటల పుస్తకాలను, మినిట్స్ పుస్తకాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

ఇదంతా చూస్తుంటే… త్వరలో మార్గదర్శి బోర్డు తిప్పేయడం కానీ, ప్రభుత్వమే చట్టప్రకారం మూయించేసే కార్యక్రమం కానీ జరిగే ఛాన్స్ ఉందనే చర్చ తీవ్రంగా మొదలైంది. మరోపక్క మార్గద‌ర్శి చిట్స్ బ్రాంచీల్లో వ‌రుస‌గా రెండో రోజూ సీఐడీ త‌నిఖీలు కొన‌సాగిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా త‌నిఖీల‌ను కొన‌సాగుతున్నాయి!