ఈసారి తప్పించుకునేందుకు అవకాశం లేదేమో.! మార్గదర్శి కుంభకోణానికి సంబంధించి రామోజీరావు విచారణకు హాజరు కావాల్సిందిగా ఏపీ సీఐడీ శ్రీముఖం పంపింది. జులై 5న ఆయన ఏపీ సీఐడీ విచారణకు హాజరు కావాల్సి వుంది. ఈసారి విచారణ హైద్రాబాద్‌లో కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. అదీ గుంటూరులో.!
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, మార్గదర్శి వ్యవస్థాపకుడు రామోజీరావు సహా, ఆయన కోడలు శైలజా కిరణ్ ఈ కేసులో నిందితులుగా వున్నారు. రామోజీరావు ఏ1 నిందితుడు. ఆయనకు పంపిన నోటీసుల్లో, ఈ నెల 5న విచారణకు హాజరు కావాల్సిందిగా ఏపీ సీఐడీ పేర్కొంది.
కోర్టుకు వెళ్ళి, విచారణ నుంచి రామోజీరావు తప్పించుకునే అవకాశం లేదన్నది న్యాయ నిపుణుల వాదన. ఒకవేళ విచారణకు హాజరైతే, రామోజీరావు అరెస్టవడం ఖాయమేనా.? ఏపీ సీఐడీ మోపుతున్న అభియోగాలు చూస్తోంటే, రామోజీరావు అరెస్టవడం తప్పదన్న సంకేతాలైతే కనిపిస్తున్నాయి.
ఎటూ, ఇలాంటి కేసుల్లో అనారోగ్యం ‘సాకు’ వుండనే వుంటుంది నిందితులకి. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఎలా విచారణ నుంచి తప్పించుకునేందుకు జిమ్మిక్కులు చేశారో చూశాం. అరెస్టు తప్పించుకునేందుకు పన్నిన వ్యూహాలవి.
అదైతే హత్య కేసు.! ఇదేమో ఛీటింగ్ కేసు. సో, రామోజీరావు తప్పించుకోవడానికి అవకాశాలు వున్నాయన్నది మెజార్టీ అభిప్రాయం. ఎట్టి పరిస్థితుల్లోనూ రామోజీరావుని అరెస్టు చేయాలన్న డిమాండ్ వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏమో, ఏం జరుగుతుందో వేచి చూడాలిక.!