Ramoji Rao: వైఎస్ కేమో చట్టం.. రామోజీ కైతే చుట్టమా?

చట్టం ముందు అందరూ సమానమే కానీ మేము కొద్దిగా ఎక్కువ సమానం!

చట్టాలు ఎదుటి వాళ్ళని శిక్షించడానికే కానీ తమబోటి వారికి వర్తించవు.

ఆ మాటకొస్తే మేము చెప్పిందే చట్టం. రాసిందే శాసనం అన్నట్టుంది రామోజీ గ్రూపు సంస్థల్లో ఒకటైన మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారం.

ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు స్వీకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్గదర్శి ఫైనాన్సియర్స్ దాన్నుంచి బయటపడడానికి కొత్త కొత్త పోకడలకు పోతోంది. కోర్టు ముందు వింత వింత వాదనలు వినిపిస్తోంది. ఇన్నాళ్లు తాము స్వీకరించిన డిపాజిట్లు అన్నీ సక్రమమే అంటూ వాదించుకుంటూ వచ్చిన మార్గదర్శి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది.

రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడం తప్పేనని పరోక్షం గా అంగీకరిస్తూనే ఆ పాపం మాత్రం తమది కాదు అంటోంది. హెచ్ యూ ఎఫ్ కర్తగా రామోజీరావు డిపాజిట్లు స్వీకరించారు కనుక దానికి ఆయనే బాధ్యుడని చెబుతోంది. ఆయన మరణించారు కనుక ఇక ఈ కేసులో వాదనలు కొనసాగించడం అనవసరమని కేసులు కొట్టేయాలని కోరుతోంది. ఈ వాదనకు సపోర్టుగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు కూడా కోర్టులో వాదనలు వినిపించడం మరింత విడ్డూరంగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించారని రిజర్వ్ బ్యాంక్ కేసు పెట్టినా ఏ ఒక్క డిపాజిట్ దారు నుంచి మార్గదర్శిపై ఫిర్యాదు లేనందున ఈ కేసును ముగించాలని ఆ ప్రభుత్వాలు వాదన వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో డిపాజిట్ దారుల నుంచి ఏమైనా కేసులు నమోదు అయితే వాటిని రిజర్వ్ బ్యాంక్ చూసుకుంటుందని, ఇక ఈ కేసును ముగించాలని అవి కోర్టులో మార్గదర్శికి అనుకూలంగా తమ వాదనలు వినిపించాయి.

అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేసు నుంచి మార్గదర్శిని బయట పడేయడానికి తమ అధికారాలను వినియోగించి రామోజీపై తమకున్న భక్తిని చాటుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ వ్యక్తి ఫిర్యాదు చేయకపోతే కేసులు కొట్టేయాలని వాదన వినిపిస్తున్న చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో ఎందుకు వివక్ష చూపారు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

క్విడ్ ప్రోకో కింద కేసులను ఎదుర్కొంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పైన ఒక్క పెట్టుబడి దారుడు ఫిర్యాదు చేయలేదు. తెలంగాణ కాంగ్రెస్ మాజీ మంత్రి శంకర్రావు కేవలం ఒక తెల్ల కాగితంపై రాసి, ఉమ్మడి హైకోర్టులో ఫిర్యాదు చేయగా,ఆనాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిస్సార్ అహ్మద్ కక్రూ సిబిఐ విచారణకు ఆదేశించారు. ఆయన రిటైర్ అవ్వగానే నాటి ఢిల్లీ పెద్దల అండతో ఏకంగా మానవ హక్కుల చైర్మన్ పదవిని అధిష్టించారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కనీసం ప్రభుత్వం తరపున కౌంటర్ కూడా దాఖలు చేయలేదు.

కొన్నాళ్ల తర్వాత శంకర్ రావు మాట్లాడుతూ ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెబితే కేసు వేసానని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. టిడిపి అదినేత చంద్రబాబు ఆదేశాల మేరకు శంకర్రావు పిటిషన్ లో కింజరాపు ఎర్రంనాయుడు ఇంప్లిటెడ్ పిటిషన్ వేశారు. ఆ తరవాత ఎర్రంనాయుడు చనిపోయారు. వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోయారు. ఇంప్లిటెడ్ పిటిషన్ వేసిన ఎర్రంనాయుడు చనిపోయాడని కానీ, సోనియా గాంధీ చెబితే కేసు వేసాను అని చెప్పిన శంకర్ రావు చెప్పిన మాటలను కానీ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి చనిపోయినా, టిడిపి నుంచి కేసు వేసిన ఎర్రంనాయుడు చనిపోయినా ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్నారు.

అయితే రామోజీరావు పైన డిపాజిటర్లు ఎవరూ పిర్యాదు చేయలేదు కనుక మార్గదర్శి కేసును కొట్టేయాలని ఏకంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులో విన్నవించడం విడ్డూరం కాక మరి ఏమిటి అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రజల డిపాజిట్లు పోయినా ప్రభుత్వానికి సంబంధం లేదు అని ప్రభుత్వాలు అఫిడవిట్లు దాఖలు చేయడం వింతగా ఉందని అంటున్నారు. అయితే రామోజీరావు మరణంతో సంబంధం లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన ఈ కేసును కొనసాగించాలి అని రిజర్వ్ బ్యాంక్ స్పష్టంగా హైకోర్టులో అఫిడవిట్ వేసింది. రామోజీరావు చనిపోయినా కొడుకు, కోడలు మార్గదర్శి బాధ్యతలు చూస్తున్నారు కనుక వారు ఈ కేసును ఎదుర్కొనక తప్పదు అని అర్థమవుతోంది.

ఎవరో ఎక్కడో చిన్న దొంగతనం చేసినా, ఓ చిరుద్యోగి వెయ్యి రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడినా, ఓ ఇంట్లో ఎవడో సత్తు గిన్నె ఎత్తుకుపోయినా చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షలు వేయాలని గగ్గోలు పెట్టే నాయకులకు మార్గదర్శి చేసింది తప్పని తెలియదా? రామోజీరావు, వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎర్రంనాయుడు చనిపోయారు అని కోర్టులు కేసులు కొట్టివేయవు అన్న సంగతి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తెలియదా? తెలియక కాదు చట్టం మార్గదర్శిని చుట్టంగా చూసుకోవాలని, చూసీ చూడనట్టు వదిలేయాలని వారి వారి ఉద్దేశం అంతే!

శ్రీలీల డేటింగ్‌ || Cine Critic Dasari Vignan About Sreeleela Marriage With Kartik Aaryan || TR