సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఈ మధ్యనే కొన్ని వరుస ట్వీట్లేసి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంత అయోమయం సృష్టించాడు. ‘దేవర’ అంటూ పవన్ కళ్యాణ్ గురించి చెప్పే బండ్ల గణేష్, తన ఇంట్లో ఎప్పుడూ వుండే పవన్ కళ్యాణ్ ఫొటోని తీసెయ్యడం దగ్గర్నుంచి, ఆయన చెప్పిన కొన్ని నీతి వాక్యాలు చాలామందిని ఆశ్చర్యపరిచాయి.
కానీ, బండ్ల గణేష్ మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చేశారు. ‘మా సారు’ అంటూ పవన్ కళ్యాణ్ గురించి తాజాగా బండ్ల గణేష్ ప్రస్తావించాడు. అంతేనా, సోషల్ మీడియాలో మంత్రి అంబటి రాంబాబు మీద ‘రంభల రాంబాబు’ అంటూ సెటైర్ వేయడం ద్వారా బండ్ల గణేష్, జనసైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేశాడు.
‘మా బండ్లన్న ఈజ్ బ్యాక్..’ అంటూ జనసైనికులు మురిసిపోతున్నారు. బండ్ల గణేష్ ఎప్పుడులా ప్రవర్తిస్తాడో ఎవరికీ తెలియదు. ఈసారి ఇప్పుడు ఇదొక కొత్త కోణం అనుకోవాలేమో.! వైసీపీ నేత, ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, అసందర్భంగానే ‘కాటన్ దుస్తుల ఛాలెంజ్ ఆపి..’ అంటూ ట్వీటేశారు పవన్ కళ్యాణ్ మీద.
‘175 సీట్లలోనూ పోటీ చేసే దమ్ముందా.? అని జనసేనానికి సవాల్ విసరడం అంబటి రాంబాబు ఉద్దేశ్యం. ఏ రాజకీయ పార్టీకైనా, దానికంటూ కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలుంటాయి. 175 పోటీ చేయొచ్చు.. లేదంటే, ఒక్కటైనా పోటీ చేయొచ్చు. ‘అలా చేయకూడదు’ అని ఏ రాజ్యాంగంలోనూ లేదు కదా.? ఈ విషయాన్ని వైసీపీ నేతలు విస్మరిస్తున్నారు. అదే అసలు సమస్య.
జనసేన అనేది వైసీపీ దృష్టిలో అసలు పట్టించుకోవాల్సిన పార్టీనే కాదు. కానీ, మంత్రులు సైతం జనసేనని సీరియస్‌గా తీసుకుంటున్నారు. అలా జనసేనకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోన్నది వైసీపీనే. పవన్ కళ్యాణ్ మాటలు ఎంతమంది జనాలకు చేరుతాయి.? జనాలు వాటిని ఎందుకు పట్టించుకుంటారు.? అన్న కనీస ఇంగితాన్ని కూడా వైసీపీ నేతలు కోల్పోతున్నారు.
ఇదిగో, ఇప్పుడు చివరాఖరికి బండ్ల గణేష్‌తో ‘రంభల రాంబాబు’ అనిపించుకోవాల్సి వచ్చింది మంత్రి అంబటి రాంబాబుకి. అవసరమా ఇదంతా.?