ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన సంచలనాత్మక చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.సినిమాలో ఎన్నో వివాదాస్పద అంశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తున్న ఇలాంటి చిత్రం ఇప్పటివరకూ ఎవరూ తీయలేదంటున్నారు.
రిలీజ్ అపాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతూండటం..ఆ అడ్డంకులు అన్నీ దాటుకుని సినిమా రిలీజ్ కు రావటంతో అందరి చూపులు ఈ సినిమాపైనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని తన సన్నిహితులైన పూరి జగన్నాథ్, ఛార్మి వంటి కొందరికి వర్మ ఇప్పటికే స్పెషల్ షో వేసి చూపించారు. రామానాయుడు స్టూడియోస్ లో ప్రీమియర్ షోని ఏర్పాటు చేశారు. కొందరు జర్నలిస్ట్ లు కూడా ఈ సినిమా చూశారు.
అక్కడ చూసిన వారి నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మధ్య కాలంలో వర్మ ఇలాంటి స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా తీయలేదని అంటున్నారు. సినిమా మరీ చుట్టేసినట్లు కాకుండా క్వాలిటీగా ఉందని, ముఖ్యంగా ఎమోషన్స్ ని బాగా రైజ్ చేసారని అంటున్నారు. సినిమా ఫస్టాఫ్ మొత్తం ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల చుట్టూ తిరుగుతుందట.
అంతేకాకుండా లక్ష్మీపార్వతికి సంబంధించిన అన్ని విషయాలు సినిమాలో చూపించారట. ఆమె మొదటి భర్త, సంతానం, ఆమె ఎన్టీఆర్ కి దగ్గర కావడం.. వారి మధ్య ప్రేమ కలగడం ఇలా అన్ని విషయాలను దాచకుండా చూపించారని చెప్తున్నారు.
ఇక సెకండ్ హాఫ్ మొత్తం రాజకీయాల చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. ఎక్కడా రాజీ పడకుండా ఇండైర్ట్ గా కాకుండా నేరుగా చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసినట్లు చెప్తున్నారు.
అలాగే ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి స్థానం నుండి దింపడం, ఆయన జబ్బు పడడం, చనిపోవడం వంటి సన్నివేశాలు ఎన్టీఆర్ నిజమైన అభిమానులను చాలా బాధపెడతాయని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయిందని అంటున్నారు. మరి ప్రేక్షకుల వద్ద నుండి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి! ఈ రాత్రి మీడియా షో వేస్తున్నారు.