ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం ఘోర పరాజయం చెందటాన్ని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన చంద్రబాబు నాయుడుకి ట్విటర్ వేదికగా ఛాలెంజ్ వదిలారు. . ‘ఎక్కడయితే మాజీ సీఎం నన్ను అరెస్టు చేయించి విజయవాడ నుంచి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఎల్లుండి(ఆదివారం) సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్ మీట్ పెట్ట బోతున్నాము. బస్తి మే సవాల్!!! ఎన్టీఆర్ నిజమైన అభిమానులకి ఇదే నా బహిరంగ ఆహ్వానం.. జై జగన్’అంటూ వర్మ ట్విటర్ వేదికగా సవాల్ విసిరటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అక్కడితో ఆగకుండా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చారిత్రాత్మక విజయం పై రామ్‌గోపాల్ వర్మ ఓ పాటను సైతం విడుదల చేశారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ‘విజయం విజయం.. ఘన విజయం’ పాటకు వైఎస్సార్‌సీపీ సంబరాలు, జగన్ పాదయాత్ర విజువల్స్‌ను జోడించి పాటను రూపొందించారు. ఈ పాటకు ‘ చంద్రబాబుపై జగన్ గ్రాండ్ విక్టరి. ఇది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రివేంజ్’ అంటూ క్యాఫ్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
ఇదంతా ఒకెత్తు … టీడీపీ, చంద్రబాబుపై వరుస ట్వీట్లతో వర్మ వదులుతున్న వ్యంగ్యాస్త్రాలు మరొక ఎత్తు. ‘నిన్న రాత్రి స్వర్గీయ ఎన్టీఆర్ నా కలలోకి వచ్చి లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల ఆపినందుకే చంద్రబాబును దారుణంగా ఒడిపోయేలా చేశానని చెప్పారు.’ అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో ఈ వేసివకాలంలో ఏపీలో చాలా స్టోక్స్ వచ్చాయని, కానీ ఒకే ఒక స్టోక్‌కు టీడీపీ విలవిలలాడిందని పేర్కొన్నారు.