ఆర్జీవీ “వ్యూహం” లో వైఎస్ భారతి పాత్రే కీలకమా?

రాం గోపాల్ వర్మ తీసే సినిమాలు ఒకెత్తు అయితే.. సరిగ్గా ఎన్నికల సీజన్ దగ్గరపడినప్పుడు తీసే సినిమాలు మరొకెత్తు. ఇప్పటికే గడిచిన ఎన్నికల్లో అలాంటి ప్రయోగాలు చేసిన వర్మ… 2024 ఎన్నికలకు ఏపీ సిద్ధపడుతున్న సమయంలో మరో అడుగు ముందుకేశారు. ఇందులో భాగంగా… “వ్యూహం” అప్ డేట్స్ ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

దర్శకుడు రాం గోపాల్ వర్మ తాజాగా మరో సెన్సేషనల్ సినిమాకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతుంటే.. రాంగోపాల్ వర్మ తన సినిమాతో పొలిటికల్ హీట్ ను మరింత పెంచనున్నారు. ఎవరూ ఊహించని విధంగా రాంగోపాల్ వర్మ.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సతీమణి వైఎస్ భారతి ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిస్తున్న “వ్యూహం” సినిమాకు సంబంధించిన ఫోటోలు విడుదల చేశారు.

ఈ సినిమా టైటిల్ ను “వ్యూహం” గా పెట్టడానికి గల కారణం… అహంకారానికి ఆలోచనకూ మధ్య జరిగిన యుద్ధం ఇతివృత్తంతో రూపొందుతుండటమే అని వర్మ చెప్పడం గమనార్హం.

ఈ సినిమాలో ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను అజ్మల్ పోషిస్తుండగా.. వైఎస్ భారతి పాత్రను మానస రాధాకృష్ణన్ పోషిస్తున్నారు. ఈసినిమాపై స్పందిచిన వర్మ… ఇది బయోపిక్ కాదు, బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ అంటూ వ్యాఖ్యలు చేశారు. “బయోపిక్ లో అబద్ధాలు ఉండొచ్చు కానీ రియల్ పిక్ లో నూటికి నూరుపాళ్లు నిజాలే ఉంటాయి” అంటూ రాంగోపాల్ వర్మ చెబుతున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి వర్మ విడుదల చేసిన ఫోటోలు చూస్తే మాత్రం… ఈ సినిమాలో వైఎస్ జగన్ కంటే… వైఎస్ భారతి పాత్రే కీ రోల్ పోషించిందా అన్న సందేహం కలుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!