భేటీలో చంద్రబాబుకు రాహుల్ గాంధీ కీలక హామీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ భేటీలో చంద్రబాబుతో పాటు ఏపీ ఎంపీలు సీఎం రమేష్, గల్లా జయదేవ్, కనకమేడల, కంభంపాటి పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో పాటు కొప్పుల రాజు, అహ్మద్ పటేల్ ఈ సమావేశంలో ఉన్నారు. దాదాపు గంటపైనే వారి మధ్య చర్చలు నడిచాయి. అనంతరం మీడియా ఎదుట హాజరయ్యారు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు. మీడియా ఎదుట మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ గురించి వెల్లడించారు చంద్రబాబు. రాహుల్, చంద్రబాబు మీడియాతో మాట్లాడిన అంశాలు కింద చదవవచ్చు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ…

దేశ భవిష్యత్తు కోసం కలిసి పని చేయాలని నిర్ణయించాం.

ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని రక్షించడమే మా ప్రధమ కర్తవ్యం.

గతాన్ని వదిలేసి భవిష్యత్తు కోసం పని చేస్తాం.

మిగిలిన విషయాలన్నీ తర్వాత చర్చిస్తాం.

రాఫెల్ వ్యవహారంలో అవినీతి జరిగింది అనడంలో సందేహం లేదు.

రాఫెల్ డీల్ పై విచారణ జరపాల్సిన వ్యవస్థలపై దాడి చేస్తున్నారు.

ఫ్రంట్ కు ఏ ఒక్కరు నాయకుడు కాదు…అందరం కలిసి పని చేస్తాం అని రాహుల్ వెల్లడించారు.

చంద్రబాబు మాట్లాడుతూ…

దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే రాహుల్ తో కలిశా

బీజేపీ వ్యతిరేక పక్షాలన్నిటిని ఒకే తాటిపైకి తీసుకొస్తాం.

దేశంలోని వ్యవస్థలన్నిటినీ బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోంది.

బీజేపీయేతర పార్టీలన్నీ ఒక సమావేశాన్ని పెట్టుకుని కార్యాచరణ నిర్ణయిస్తాం.

ఏపీ ప్రత్యేక హోదా అంశానికి రాహుల్ మద్దతు ఉంది. ఏపీ విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాహుల్ హామీ ఇచ్చినట్టు చంద్రబాబు తెలిపారు.

ప్రత్యేక హోదా ఏపీకి ఎంతో కీలకం. మొదటి నుండి ప్రత్యేక హోదా అంశానికి కట్టుబడి ఉన్నట్టు రాహుల్ గాంధీ పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. ఇప్పుడు చంద్రబాబుతో భేటీలో కూడా ఆయన ఇదే హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం ఎదురు చూస్తున్నారు ఏపీ ప్రజలు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ పై వ్యతిరేకంగా ఉన్నారు ఆంధ్రులు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రత్యేకహోదా హామీ ఇవ్వడంతో వీరి పొత్తు బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.