కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి పగటి కలలు కంటున్నారా?

 

(వి. శంకరయ్య)

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో ఒంటరిగా పోటీ చేయడమా ? లేక మరీ విడమరిచి చెప్పాలంటే టిడిపి తో పొత్తు పెట్టుకుని పోటీ చేయడమా? అనే అంశంపై రాహుల్ గాంధీ తో చర్చకు ఢిల్లీ వెళ్లిన రఘు వీరారెడ్డి ఎటూ తేల్చుకోకుండానే పత్రికల వారితో మాట్లాడుతూ చేసిన ప్రసంగం పైకి ఆశ్చర్యం కలిగించే విధంగా వున్నా వాస్తవంలో టిడిపి కి పరోక్షంగా బెదిరింపు ధోరణిలో సాగింది.
ఎపిలో తమతో పొత్తు పెట్టుకునే పార్టీ నక్క కొమ్ము తొక్కి నట్లు గా చెప్పారు.అంటే అధికారంలోనికి రావాలంటే తమతో పొత్తు తప్పని సరి అని తేల్చారు. ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి తప్ప మరో పార్టీ ఏదీ లేదు. అయనా రఘు వీరారెడ్డి గుంభనంగా మాట్లాడుతూ పొత్తు తమ కన్నా టిడిపికే అవసరం అన్నట్లు చెప్పారు. అంతే కాదు. ఎన్నికల తర్వాత తాము నిర్ణయాత్మక శక్తి గా వుంటామని కూడా తనకు తనే కితాబు ఇచ్చు కొన్నారు.

 రఘు వీరారెడ్డి ఇలా మాట్లాడటం వెనుక బలమైన కారణాలు వున్నాయి. తెలంగాణ ఎన్నికల అనుభవం పెట్టుకొని టిడిపి చేయి ఇస్తుందేమో ననే భయం వున్నట్లు వుంది. తెలంగాణ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కు తల బొప్పి కట్టింది. ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టు కున్నా పెట్టుకోక పోయినా మూడు నాలుగు విధాల ఇబ్బంది వుంటుందనే భయం పట్టుకుంది.

1) ప్రధాని మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలసి మహా కూటమి తను రూపొందించుతూ ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు లేక పోతే మహా కూటమికి అర్థమే వుండదు.

2) తెలంగాణ ఎన్నికల ముందే కాంగ్రెస్ పొత్తు పై ముఖ్య మైన టిడిపి నేతలు వ్యతిరేకించారు. అయినా తెలంగాణలో పొత్తు పెట్టుకుని వెళ్లితే నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. తదుపరి తను గుంభనంగా వున్నా ఎక్కువ మంది పార్టీ నేతలు అంగీకరించే స్థితిలో లేరు. తెలంగాణ పరిస్థితి ఎపిలో కూడా ఎదురౌతుందనే భయం అందరినీ వేధిస్తున్నది. ముఖ్యమంత్రి ఎటూ తేల్చుకోలేక వున్నారు.

3) మరో ముఖ్య మైన అంశమేమంటే బిజెపి పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపొందినంత మాత్రాన ఎపిలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు గతం కన్నా పెరిగిన అంచనాలు లేవు. కాంగ్రెస్ కు కొన్ని సీట్లు ఇచ్చితే వారు కాస్తా ఓటమి పాలైతే తెలంగాణ లాగా మొదటికే మోసం వస్తుందనే భయం ముఖ్యమంత్రి తో పాటు టిడిపి నేతలతో వుంది.

4) ఇవన్నీ అటుంచి ఇప్పటికే టిడిపి పుష్పక విమానం లాగా వుంది. మరీ వైసిపి నుండి వచ్చిన వారిని పాత కాపులను సంతృప్తి పరచడం ముఖ్యమంత్రికీ కత్తి మీద సాముగా వుంది. ఒకవేళ తెలంగాణ లో విజయ కేతనం ఎగుర వేసి వుంటే ఆ బూచి చూపెట్టి సీట్లు లభించని నేతలు గోడ దూక కుండా కట్టడి చేసి వుండ వచ్చు. ప్రస్తుతం ఆ అవకాశమూ లేదు. ఇప్పటికే కొందరు గోడ దూకారు. చాలా మంది దూకేందుకు సిద్ధంగా వున్న అంశం ముఖ్యమంత్రి తో పాటు లోకానికి బాగా తెలుసు.

ఈ నేపథ్యంలో రేపు టిడిపి తమతో పొత్తుకు చొరవ చూపు తుందో లేదో అనే భయం రఘు వీరారెడ్డికి బలంగా పట్టు కొన్నటు వుంది. అందుకే కింద పడ్డా గెలుపు మాదే అన్నట్టు తమతో పొత్తు పెట్టుకున్న వారు రాష్ట్రంలో అధికారంలోనికి వస్తారని పరోక్షంగా హెచ్చరిక చేశారు. ఇది రాజకీయాలలో అసహజ మేమీ కాదు.
వాస్తవంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తంగా వైసిపి వెంబడి పోయింది. కేవలం కాంగ్రెస్ పార్టీ వాసనలు లేదా ఏ పార్టీలో చేర కుండా వున్న కాంగ్రెస్ నేతల వ్యక్తి గత పలుకు బడి తప్ప మిగిలి ఏమీ లేదు. ఈ వాస్తవం ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు టిడిపి నేతలకు బాగా తెలుసునని రఘువీరారెడ్డికి కూడా తెలుసు. అయితే ప్రస్తుతం పరిస్థితిలో జాతీయ సినేరియాలో చంద్రబాబు తల వంచక తప్పదని చాల మంది కాంగ్రెస్ నేతల నమ్మకం .

ఒక విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాష్ట్రంలో ఎన్నికల పొత్తు గురించి ముందు నుయ్యి వెనుక గొయ్యి గా భావిస్తున్నారు. కాంగ్రెసును వదలి పెట్ట లేరు. వారి వలన వచ్చే ఓట్లు పెద్దగా వుండని తెలుసు. అయినా తప్పదు. ఆ దిశగా సాగిన ఆలోచనలే పవన్ కళ్యాణ్ పొత్తుపై నోరు జారి పరువు పోగొట్టు కున్నారు. తమాషా ఏమంటే ఇప్పటికి ముఖ్యమంత్రి లోనే కాదు. టిడిపి నేతలు కూడా ఇంకా పవన్ పై ఆశలు పెట్టుకొని వుండటం ఆశ్చర్యం కలుగుతోంది

అయితే రఘు వీరారెడ్డి పరోక్ష హెచ్చరికలు చూచి టిడిపి లో బయపడే వారు లేరు. కాని మంచి అయినా చెడ్డ అయినా అధినేత ఆదేశించితే ఆమోదించక తప్పదు. రఘు వీరారెడ్డి ఢిల్లీ వెళ్లిన తర్వాత టిడిపి పొత్తు గురించి అంత గుంభనంగా హెచ్చరిక ధోరణితో మాట్లాడారంటే రాహుల్ గాంధీ స్థాయిలో కూడా అటు ఇటు చర్చలు సాగినట్లు అవి అంత ఆశాజనకంగా లేనట్లు భావించాలి.

ఇంత మాట్లాడిన రఘువీరారెడ్డి తుదకు జావ లాగా జారి పోయి భారమంతా రాహుల్ గాంధీది అని తేల్చడం కొసమెరుపు.