ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత పార్టీ మీద దండయాత్రను ఆపలేదు. తనకు అవకాశం ఉన్న చోటల్లా పార్టీని చిక్కుల్లోకి నెడుతున్నారు. ఇప్పటికే తనకు సొంత పార్టీ నుండి భద్రత కావాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఆయన నిన్న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. తాజాగా ఈరోజు రాష్ట్రపతిని కలిసిన ఆయన సొంత పార్టీ వారే తనను బెదిరిస్తున్నారని అని రాష్ట్రపతికి వివరించి భద్రత కోరుతూ ఒక లేఖను అందించారు. అలాగే ఆమరావతినే పాలనా రాజధానిగా కొనసాగించాలని ఇంకో లేఖను సమర్పించారు. రాజధాని విషయంలో మాత్రం రఘురామరాజు వైసీపీ ప్రభుత్వ విధానాన్ని పూర్తిగా తప్పుబట్టారు.
రాష్ట్రపతితో జరిగిన సమావేశంలో ఎక్కువ సమయం రాజధాని గురించే చర్చించానన్న రామరాజు ఏపీలో రాజ్యాంగ విరుద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారట. శాసనమండలిలో బిల్లు పాస్ కాకపోతే ఆ బిల్లు మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించారు. కానీ మండలి సెక్రటరీ మాత్రం దాన్ని పక్కన పెట్టారని, శాసనమండలి ఛైర్మన్ నిర్ణయాన్నే సెక్రటరీ ఒప్పుకోకపోవడం ఆ వ్యవస్థకే మంచిది కాదని అన్నారు. ఇప్పుడు శాసనమండలిలో జరిగింది రేపు శాసనసభలో కూడా జరగొచ్చు. బిల్లులు పాస్ కాలేదని ఏకంగా ఆవేశంలో శాసనమండలినే రద్దు చేసేశారన్నారు.
ప్రజలు ఆమరావతినే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారన్న రామరాజు గవర్నర్ సైతం అటార్నీ జనరల్ తో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని, గతంలో అమరావతే రాజధానిగా ఉంటుందన్న వారు ఇప్పుడు మాట తప్పుతున్నారని ప్రశ్నించారు. అంతేకాదు ప్రభుత్వం ఏ కులం మీద అయితే కక్ష పెంచుకుందో వారి కంటే ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఎక్కువ భూములిచ్చారని, వారి కోసమైనా వైఖరి మార్చుకోవాలని అన్నారు. ఒకవైపు జగన్ బృందం గవర్నర్ నుండి మూడు రాజధానులకు ఆమోదం వస్తుందని ఆశలు పెట్టుకుని ఉంటే రాఘురామరాజు ఇలా రాష్ట్రపతి వద్దకు వెళ్లి పిర్యాధు చేయడం అధికార పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు.