రఘురామ లొల్లి.! అసలుు నిన్నెవరు కొట్టారయ్యా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మళ్ళీ ‘నన్ను కొట్టారు’ అంటూ పాత ఆరోపణల మీద, యాగీ చేస్తున్నారు. వైసీపీ నుంచి గెలిచి, వైసీపీ పార్టీ మీదా, వైసీపీ ప్రభుత్వమ్మీదా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదా అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు రఘురామకృష్ణరాజు గత కొంతకాలంగా.

సమాజంలో అలజడిని సృష్టించేలా రఘురామ వ్యాఖ్యలు వుంటున్నాయన్న కోణంలో కేసులు నమోదయ్యాయి, రఘురామని అరెస్టు చేశారు.. ఈ క్రమంలోనే ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగిందన్నది గత కొంతకాలంగా వినిపిస్తున్న ఆరోపణ.

ఈ విషయమై రఘురామకృష్ణరాజు న్యాయపోరాటం కూడా ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశానన్నారు.. న్యాయస్థానాల్ని ఆశ్రయించానన్నారు.. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసినట్లు చెప్పుకున్నారు రఘురామకృష్ణరాజు.

నిజంగానే, రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ జరిగి వుంటే.. ఇంకేమైనా వుందా.? అసలు కస్టడీలోకి తీసుకున్నాక పోలీస్ అధికారులు, థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశమెంత.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి.

రఘురామకృష్ణరాజు ఏమీ ఆషామాషీ వ్యక్తి కాదు. ఆర్థికంగా చాలా బలమైన రాజకీయ నాయకుడు. పైగా, లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు నర్సాపురం నుంచి. కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీకి అత్యంత సన్నిహితుడాయన.

కస్టోడియల్ టార్చర్ జరిగిందంటూ న్యాయస్థానంలో గతంలోనే ఆయన న్యాయమూర్తికి మొరపెట్టుకున్నారు. ఏకంగా మిలిటరీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య చికిత్స కూడా అందింది.

కస్టోడియల్ టార్చర్ నిజమైతే, ప్రభుత్వంపై ఈపాటికే చర్యలుండేవి. ప్రధానంగా సీనియర్ ఐపీఎస్ అధికారులు సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులుపై కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు చేస్తూ, ప్రధానికి ఫిర్యాదు చేశారు తాజాగా రఘురామ.