ఉండి టాపిక్… ట్రిపుల్ ఆర్ కు పక్కపార్టీ ప్రత్యర్థులు అవసరం లేదు!

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి ఉండి అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ ఆల్ మోస్ట్ కన్ ఫాం అయిపోయినట్లే! ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పండగపూటా కంటతడి పెట్టుకుంటూ మరీ కన్ ఫాం చేశారు! ఇక అధికారిక ప్రకటనే తరువాయని చెబుతున్నారు! ఈ సమయంలో టిక్కెట్ అయితే దక్కించుకుంటున్నారు కానీ.. ఉండిలో ఆర్.ఆర్.ఆర్. కి అంత అనుకూల వాతావరణం లేదనే చర్చ అప్పుడే వెస్ట్ లో మొదలైపోయింది!

అవును… కూటమిలోని పార్టీల అధినేతలతో తనకున్న సాన్నిహిత్యం మేరకు రఘురామ కృష్ణంరాజు ఎవరిని ఇబ్బంది పెట్టి అయినా టిక్కెట్ దక్కించుకోవచ్చు కానీ.. కార్యకర్తలను, స్థానిక నాయకులను కలుపుకి పోవడం.. అసంతృప్తులను బుజ్జగించడం అంత ఈజీ కాకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు. పైగా… డబ్బుతోనే అన్నీ సాధ్యం కాదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారని తెలుస్తుంది. కారణం… రఘురామ ఎంట్రీ ఇస్తే.. ఉండిలో టీడీపీ మూడు ముక్కలు అవ్వడం ఖాయం అని అంటున్నారు!

ఉండి నియోజకవర్గం టీడీపీలో ఇప్పటికే రెండు వర్గాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. తనకు టిక్కెట్ ఇవ్వలేదని ఆరోపిస్తూ, ఆవేదన చెందుతూ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు రెబల్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో రామరాజుకి కొత్త సమస్య వచ్చిపడిందని చెబుతున్నారు. ఈ సమయంలో ఉండిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో రామరాజు ఓపెన్ అయిపోయారు. తన ఆవేదనను కార్యకర్తలతోనూ, అనుచరులతోనూ పంచుకున్నారు.

ఇందులో భాగంగా… టికెట్ వేరేవారికి కేటాయించారంటూ కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు రామరాజు. ఈ సమయంలో… కార్యకర్తలు, కుటుంబ సభ్యుల సూచనలు తీసుకుని నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. రాజకీయాలు విరమించుకోవడంపైనా ఆలోచిస్తానని చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు మార్కు రాజకీయాలకూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్రికలు కూడా అచ్చేసి పంచుతున్న సమయంలో పెళ్లి క్యాన్సిల్ అయ్యినట్లుందని వాపోతున్నారు!!

దీంతో ఇప్పుడు ఉండి టీడీపీలో జరగాల్సిన రచ్చ అంతా జరిగిపోతుంది. ఇప్పటికే శివరామ రాజుకి హ్యాండ్ కావాల్సిననన్ని ఇబ్బందులు వస్తోన్న వేళ… ఇప్పుడు రఘురామ ఎంట్రీ అవసరమా అనేది కీలక ప్రశ్నగా ఉంది! లోకల్ గా ఇంత రచ్చ జరుగుతున్న నేతథ్యంలో… రఘురామకు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది వేచి చూడాలి!