బాబుని ఇరికించేస్తున్నారు… రఘురామ ప్లాన్ ఇదేనా?

పొత్తులో భాగంగా తనకు నరసాపురం లోక్ సభ టిక్కెట్ దక్కకపోవడంతో రఘురామ కృష్ణంరాజు మంటెక్కిపోతున్నారని అంటున్నారు. పార్టీ ఏదైనా… కూటమిలో భాగంగా నరసాపురం టిక్కెట్ తనదే అంటూ ఇంతకాలం ధీమాగా చెప్పిన ఆయనకు బీజేపీ రూపంలో షాక్ తగిలింది. అయితే… పేల్చింది చంద్రబాబే కానీ.. ఆ తుపాకీ బీజేపీ భుజంపై పెట్టారంతే అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది.

ఈ సమయంలో నరసాపురం లోక్ సభ స్థానం తీవ్ర హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నరసాపురం లోక్ సభ స్థానానికి తమ అభ్యర్థిని ప్రకటించింది వైసీపీ. ఇదే సమయంలో కూటమిలో భాగంగా బీజేపీ నుంచి శీనివాస్ వర్మ పేరు ప్రకటించడం జరిగింది. దీంతో… ఎవరి ప్రచార కారక్రమాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఈ సమయంలో తనకు టిక్కెట్ దక్కకపోవడంపై నిప్పులు చెరుగుతున్నారు రఘురామ. ఈ సమయంలో తాజాగా మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తనకు టిక్కెట్ దక్కకపోవడంపై రఘురామ రకరకాలుగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా… తనకు టిక్కెట్ దక్కకపోవడంలో జగన్ విజయం సాధించారని, ఈ విషయంలో తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్త డొస్ పెంచారు. ఈ సందర్భంగా చంద్రబాబును కాస్త ఇరకాటంలో పడేసేలా మాట్లాడారనే కామెంట్లు వినిపించాయి.

ఇందులో భాగంగా… తనకు టిక్కెట్ ఇప్పించకపోతే… నమ్ముకున్న రఘురామ కృష్ణంరాజు లాంటివారికే టిక్కెట్ ఇప్పించుకోలేకపోయాడు.. ఇంక కేంద్రంతో పోరాడి పోలవరానికి నిధులు ఎలా తెస్తారు అని ప్రజలు అనుకునే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో… తనకు టిక్కెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఎలా మారే అవకాశాలు ఉన్నాయి అనే విషయంలో రఘురామ మోషన్ పోస్టర్ వదిలారనే చర్చ తెరపైకి వచ్చింది.

అదే సమయంలో… తనకు టిక్కెట్ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై ఉందని తేల్చి చెప్పారు. ఈ సమయంలో తాజాగా మరోసారి మైకుల ముందుకు వచ్చిన రఘురామ… తెరపైకి విశ్వాసం, ప్రజాభిప్రాయం, ప్రజల కోరిక అనే విషయాలను తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా… తనకు నరసాపురం టిక్కెట్ వచ్చే విషయంపై, తనకంటే ఎక్కువగా నియోజకవర్గ ప్రజలకే కాదు.. రాష్ట్రంలోని జగన్ ని వ్యతిరేకించే వారందరికీ నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.

అనంతరం… కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేయగలనన్న నమ్మకం, విశ్వాసం తనకు ఉన్నాయని.. కూటమి తనకు నూటికి నూరుశాతం న్యాయం చేస్తుందని రఘురామ చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై పూర్తి విశ్వాసం ఉందని… చంద్రబాబు తనకు అన్యాయం చేయరని రఘురామ చెబుతున్నారు. ఇలా మాటకు ముందు ఒకసారి చంద్రబాబు, మాట తర్వాత ఒకసారి చంద్రబాబు పేరు చెబుతూ… ఆయనకు బాధ్యత గుర్తు చేస్తున్నట్లున్నారని అంటున్నారు పరిశీలకులు.

దీంతో… రఘురామ కృష్ణంరాజుకి నరసాపురం టిక్కెట్ దక్కితే సరేకానీ… పొరపాటున ఆయనకు టిక్కెట్ దక్కే అవకాశం లేదనే మాట చంద్రబాబు నుంచి వస్తే… అప్పుడు మొదలవ్వొచ్చు అసలు సిసలు రచ్చ అని అంటున్నారు నెటిజన్లు!!