అసెంబ్లీకి రఘురామ… పశ్చిమ గోదావరిలో నియోజకవర్గం!!

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోని హాట్ టాపిక్ లలో రఘురామ కృష్ణంరాజుకి టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి టిక్కెట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్టీలు ఏవైనా నరసాపురం ఎంపీ టిక్కెట్ తనదే అంటూ చంద్రబాబు, పవన్ సమక్షంలోనే రఘురామ ప్రకటించుకున్నారు! ఈ క్రమంలో నరసాపురం టిక్కెట్ బీజేపీ ఖాతాలో చేరడంతో.. రఘురామ అభ్యర్థిత్వం కన్ ఫాం అని అంతా భావించారు. అయితే… కాషాయ పార్టీ కనుమూరికి షాక్ ఇచ్చింది. అనూహ్యంగా శ్రీనివాస వర్మను తెరపైకి తెచ్చింది.

వాస్తవానికి… సుమారు నాలుగేళ్లుగా టీడీపీకి పరోక్షంగా సేవ చేసింది రఘురామ కృష్ణంరాజు! టీడీపీ నేతలను తలదన్నుతూ ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా ఎన్నో విమర్శలు చేశారు. దానికి అనుగుణంగా ఒక వర్గం మీడియాలో ఆయనకు విపరీతమైన కవరేజ్ దొరికింది. టీడీపీలో ఫ్యాన్ బెల్ట్ కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో రఘురామను అకామిడేట్ చేయాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉందనే చెప్పాలి.

కాకపోతే… యూస్ అండ్ త్రో పాలసీలో భాగంగా ఆయనకు టిక్కెట్ దక్కలేదనే విమర్శలు తెరపైకి వచ్చాయి. దీంతో.. తనను అకామిడేట్ చేయలేకపోయిన చంద్రబాబును, టిక్కెట్ ఇవ్వలేకపోయిన బీజేపీని విమర్శించే ధైర్యం లేకో ఏమో కానీ… రఘురామ కృష్ణంరాజు ఈ విషయంలోనూ వైఎస్ జగన్ పైనే విమర్శలు చేశారు. దీంతో రఘురామ పరిస్థితిపై కొంతమంది జాలి చూపిస్తే.. మరికొంతమంది తిక్క కుదిరిందని ఎద్దేవా చేస్తే.. మరికొంత మంది మాత్రం అట్టుంటది జగన్ తోని అని డైలాగులేశారు.

అయితే.. అనూహ్యంగా రఘురామ కృష్ణంరాజుకి సంబంధించిన ఒక ఊహాగాణం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి ఆ నియోజకవర్గానికి ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించినప్పటికీ… ఆయనను అన్ని రకాలుగానూ బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో అన్నీ అనుకూలంగా జరిగితే ఒక కీలకమైన నియోజకవర్గంలోనే రఘురామకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ విషయంలో ఒక మీడియా ఛానల్ అధినేత రంగంలోకి దిగారని.. రఘురామకు టిక్కెట్ దక్కకపోతే అది కూటమిపై నెగిటివ్ సంకేతాలు పంపే ప్రమాదం ఉందని చెబుతున్నారని తెలుస్తుంది. అలా “డిసైడ్” చేసే ప్రయత్నాల్లో ఆ అధినేత ఉన్నారని అంటున్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఏమేరకు సక్సెస్ అవుతాయనేది వేచి చూడాలి!