ట్రిపుల్ ఆర్ అక్కసు: తెరపైకి తమలపాకుల యుద్ధం!

వివేకా హత్య కేసులో వాస్తవాస్తవాలు దేవుడికే ఎరుకేమో కానీ.. ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్టుపై మాత్రం గాసిప్పులు మామూలుగా రావడం లేదు. అయితే తాజాగా మోడీ సర్కార్ జగన్ పై మనసుపడుతుందని, అతనితో స్నేహం కోరుకుంటుందని కథనాలొస్తున్న తరుణంలో… దానికి ప్రతిఫలంగా అవినాష్ పై సీబీఐ అరెస్టు ఉండకపోవచ్చని కథనాలు వస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలో మైకందుకున్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.

కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయకపోవడంతో ఉడికెత్తిపోతున్నారు ఆర్.ఆర్.ఆర్. అవినాష్ పై టీడీపీ నేతలకంటే ఎక్కువగా విమర్శలు చేస్తూ.. కొన్ని సందర్భాల్లో ఇంగితం మరిచి కామెంట్లు చేస్తున్నారనే పేరు సంపాదించుకున్న ఆయన తాజాగా సీబీఐ వ్యవహారంపై తమలపాకుల యుద్ధం కామెంట్లు చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని గానీ, వద్దు అని గానీ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం లేదని మొదలుపెట్టిన రఘురామ… అవినాష్ అరెస్ట్‌ పై సీబీఐ ఇష్టానికే వదిలేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో… అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్న ఆలోచన ఉంటే.. సీబీఐ బృందాలు కర్నూలులోని ఆస్పత్రికి వెళ్లాలి గానీ ఎస్పీతో చర్చలు జరపడం ఏమిటని ప్రశ్నించారు.

అనంతరం తన అక్కసు బయటపెట్టే ప్రయత్నం చేసిన ఆయన… అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేసే ఉద్దేశం సీబీఐకి ఉన్నట్టుగా అనిపించడం లేదని చెప్పుకొచ్చారు. అవినాష్ రెడ్డికి సీబీఐకి మధ్య తమలపాకుల యుద్ధం నడుస్తోందని.. ఇద్దరు తమలపాకులతో గట్టిగా కొట్టుకుంటూ ఏదో జరుగుతోందన్న భావన కలిగిస్తున్నారని విమర్శించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… వివేకా హత్యకేసులో అవినాష్ పాత్రపై సీబీఐ ఇప్పటి వరకూ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వలేదు కానీ… ఒక వర్గం మీడియాలో ఫుంకాను ఫుంకాలుగా కథనాలు మాత్రం వండి వడ్డించేస్తున్నారు. ఆఖరికి అవినాష్ రెడ్డి తల్లి ఆసుపత్రులో చేరిన విషయాన్ని కూడా.. అదొక డ్రామా అన్నట్లుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా తమ స్థాయిని తగ్గించేసుకుంటున్నారు!