పోటీవిషయంలో మనసు మార్చుకున ట్రిపుల్ ఆర్..!

సినిమాల్లో ఆర్.ఆర్.ఆర్. ఎంత ఫేమస్సో… ఏపీ రాజకీయాల్లో కూడా ఆర్.ఆర్.ఆర్. (రఘురామ కృష్ణంరాజు) కూడా అంతే ఫేమస్ అన్నా అతిశయోక్తి కాదేమో. 2019సార్వత్రిక ఎన్నికల్లో చివరి నిమిషంలో వైకాపాలో చేరిన ఆయన.. ఆ ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా గెలిచారు.. హస్తినకు వెళ్లారు. అయితే కాలక్రమంలో జరిగిన కొన్ని కారణాలతో వైకాపా అధినేత జగన్ కు ట్రిపుల్ ఆర్ కు గట్టిగా చెడింది.

దీంతో… నిత్యం సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్ చానెళ్లలోనూ, టీవీ చానెళ్లలోనూ వైసీపీ ప్రభుత్వంపై గోదావరి వెటకారాన్ని మిక్స్ చేసి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఆర్.ఆర్.ఆర్. ఏ పార్టీనుంచి పోటీచేస్తారు.. అసెంబ్లీకి వెళ్తారా.. లేక, పార్లమెంటుపైనే ఆసక్తి చూపిస్తారా? వంటి ప్రశ్నలు ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి.

రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీ కలిసే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది కాబట్టి… జనసేన నుంచి ఈసారి నరసాపురం ఎంపీగా కొణిదెల నాగబాబు పోటీచేసే అవకాశం ఉంది. అవును… జనసేన–టీడీపీ పొత్తు కుదిరే అవకాశం పుష్కలంగా కనిపిస్తున్న నేపథ్యంలో నరసాపురం నుంచి జనసేనాని పవన్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారని అంటున్నారు. నరసాపురం ఎంపీ స్థానంలో టీడీపీ ఎక్కువసార్లు గెలిచిన సందర్భాలు కూడా లేకపోవడంతో.. ఈ సీటు విషయంలో బాబు నుంచి పెద్దగా వ్యతిరేకత వచ్చే అవకాశాలు లేవు!

మరి రఘురామ కృష్ణంరాజు టీడీపీలో చేరినా, జనసేనతో జతకట్టినా ఎక్కడినుంచి పోటీచేస్తారు అంటే… ఈసారి అసెంబ్లీకి రావాలని బెమపడుతున్నారంట ఆర్.ఆర్.ఆర్.! గత ఎన్నికల్లో భీమవరం ప్రజలు ఇచ్చిన తీర్పుతో.. పవన్ అటుచూసే ఆలోచన చేయకపోవచ్చని అంటున్నారు. కాబట్టి… క్షత్రియ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న భీమవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని ఆర్.ఆర్.ఆర్. భావిస్తున్నారంట. అంటే… ఈసారి గ్రంథి శ్రీను ప్రత్యర్థి రఘురామకృష్ణంరాజన్నమాట!

సపోజ్ పొత్తులో భాగంగా… భీమవరం నుంచి పోటీచేసే అవకాశం లేకపోతే? అప్పుడు నరసాపురం నుంచి పోటీచేయొచ్చని అంటున్నారు. నరసాపురంలో ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్. సామాజికవర్గానికే చెందిన ముదునూరి ప్రసాదరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్ కు సన్నిహితుడిగా పేరున్న ప్రసాద్ రాజుని కేబినెట్ మంత్రి హోదా ఉన్న… ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించారు జగన్.