వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు నిర్వహించిన బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో గుండెకు సంబంధించిన సర్జరీ జరిగింది. శస్త్రచికిత్స విజయవంతమైంది. అయితే మరో రెండు రోజులు ఐసీయూలో ఉండాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు.కాస్త కోలుకున్న తర్వాత ఆస్పత్రిలోని సాధారణ గదికి షిఫ్ట్ చేయనున్నారు. పూర్తి చికిత్స పొంది రెట్టింపు ఉత్సాహంతో దినచర్యలు ప్రారంభిస్తారని ఎంపీ రఘురామ కుటుంబ సభ్యులకి తెలిపారు. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులు, మిత్రులు, సన్నిహితులకు ఆయన కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, సొంత వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ రఘురామ గళం విప్పుతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే గత రెండు, మూడు రోజులుగా రఘురామ మీడియా సమావేశం నిర్వహించడం లేదు. అలాగే ఈ నెల 28న అమరావతికి సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో సైతం ఎంపీ రఘురామ కాస్త అనారోగ్యంగా ఉన్నట్లు కనిపించింది. ఈ తరుణంలో సోమవారం ఆయనకు సర్జరీ జరిగిందని, విజయవంతంగా పూర్తయిందని కుటుంబ సభ్యులు ప్రకటించారు.