ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఇక కొంతకాలంగా దూకుడుమీదున్న చంద్రబాబు… తాజా పరిణామాలతో ఒక అడుగు ముందుకేస్తే, రెండు అడుగులు వెనక్కి వేస్తున్నారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో పార్టీలో అంతర్గత విభేదాలూ తారాస్థాయికి చేరుకుంటున్న పరిస్థితి. దీంతో… తాజాగా ముగ్గురు ఎంపీల విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఏ పార్టీలో అయినా ప్రత్యర్థుల కంటే ప్రధాన సమస్య అంతర్గత విభేదాలు. అది అధికారంలోని ఉన్న పార్టీ అయినా.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయినా. ఆ పార్టీ ఈ పార్టీ అనే తారతమ్యాలేమీ లేవు. ఏపార్టీకి ఈ సమస్య వచ్చినా… అది కలిగించే చికాకు అంతా ఇంతా కాదు. అయితే ఇందులో భాగంగా తాజాగా చంద్రబాబుకు ఇద్దరు ఎంపీలు చికాకు కలిగిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును… టీడీపీ విజయవాడం ఎంపీ కేశినేని శీనివాస్ (నాని), గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ల వ్యవహారం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరిలో ఇప్పటికే కేశినేని నానీ ఎర్ర జెండా ఎగరేసి, బాబుకు సవాళ్లు విసురుతుండగా.. గల్లా జయదేవ్ మాత్రం తన సహజశైలిలో సైలంటుగానే తెరవెనుక కార్యక్రమాలు చేసుకుంటున్నారని తెలుస్తుంది.
వీరిద్దరూ వైసీపీకి టచ్ లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ ఎస్ అంటే వీరిద్దరూ ఫ్యాన్ కిందకి చేరిపోయి రిలాక్స్ అవ్వాలని భావిస్తున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ సమయంలో అంతా ఊహించినట్లుగానే చంద్రబాబుకు కాస్త ఉపశమనం కలిగించారు నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు.
తాజాగా హస్తిన టూర్ కి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబుకు.. ఈ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజుక్ స్వాగతం పలికారు. టీడీపీ ఎంపీలు దూరంగా ఉన్న సమయంలో ఒక్క కింజరపు రామ్మోహన్ నాయుడు మాత్రమే బాబుకు స్వాగతం పలకడానికి రాగా… ఆయనతో పాటు ట్రిపుల్ ఆర్ కూడా ఎదురెల్లారు. దీంతో ఆర్.ఆర్.ఆర్. రాజకీయ భవిష్యత్తుపై ఒక క్లారిటీ వచ్చేసింది.
మరి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ ముగ్గురు ఎంపీలు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు.. వారు అనుకున్న టార్గెట్స్ ని ఎలా రీచ్ అవ్వబోతున్నారనేది వేచి చూడాలి!