ట్రిపుల్ ఆర్ ను గట్టిగా తగులుకున్న భరత్… బాస్ కి తెలుసా?

వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ అధికారపార్టీకి పంటికింద రాయిలా మారరన్నది రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట. ఏపీలో జగన్ సర్కార్ చేసే ప్రతిపని పైనా, తీసుకునే ప్రతీ నిర్ణయం పైనా ప్రతిపక్షాలకంటే బలంగా విమర్శిస్తుంటారు ఆర్.ఆర్.ఆర్.! ఇక తనకు పార్టీలో గూడచారులు ఉన్నారని చెబుతూ… అప్పుడప్పుడూ పార్టీ అంతర్గత విషయాలపై కూడా తనవైన వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే ఆర్.ఆర్.ఆర్. వ్యాఖ్యలపై వైకాపా నేతలు ఏనాడూ పెదవి విప్పింది లేదు.. ఎదురు విమర్శలు చేసిందీ లేదు!

రఘురామ కృష్ణంరాజు ఎంత మాటకారైనా.. ఆయన్ని అదే స్థాయిలో, అంతకుమించిన రీతిలో విమర్శించగలిగే సబ్జెక్టు, వాక్ చాతుర్యం కలిగిన నేతలు వైకాపాలో పుష్కలంగా ఉన్నారు. వీరంతా చంద్రబాబుపైనా – పవన్ పైనా రకరకాల స్టైల్స్ లో విరుచుకుపడుతుంటారు. ఒకరు నిప్పులు చెరుగుతూ విమర్శలు చేస్తుంటే… మరొకరు సున్నితంగా దింపేస్తుంటారు. కానీ… ఆర్.ఆర్.ఆర్. విషయానికొచ్చే సరికి మాత్రం వారెవరూ నోరుమెదపరు! అంటే… ఆర్.ఆర్.ఆర్.ని అంత పట్టించుకోవద్దు అని జగన్ అన్నారో ఏమో తెలియదు కానీ… లోపల ఎంత ఉడికిపోతున్నా.. పైకి ఆయన్ని ఆటలో అరటిపండులా చూస్తుంటారు!

అయితే ఈ విషయంలో గత కొన్నిరోజులుగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాత్రం రఘురామకృష్ణంరాజుపై తీవ్రస్థాయిలో ఫైరవుతు విమర్శలు చేస్తున్నారు.. సవాళ్లు విసురుతున్నారు. ఆర్.ఆర్.ఆర్. కు సమఉజ్జీగా గోదావరి వెటకారాన్ని ప్రయోగిస్తున్నారు. అయితే… అందుకు జగన్ నుంచి భరత్ కు అనుమతి వచ్చిందా.. లేక, అది భరత్ సొంత నిర్ణయమా అన్నది తెలియాల్సి ఉంది!

ఈ క్రమంలో… తాజాగా ఆర్.ఆర్.ఆర్. పై ఫైరయ్యారు భరత్. విగ్గు పెట్టుకుని, పెగ్గు పట్టుకుని మందు తాగిన కోతిలా రఘురామ చిందులు వేస్తున్నారని భరత్ ఆరోపించారు. “చిందులు వేస్తే వేసుకో.. కానీ మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు వాగితే బాగుండదు.. నోరు అదుపులో పెట్టుకో” అంటూ భరత్ ఘాటుగా హెచ్చరించారు. ఇప్పుడు ఇదే గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకాలం రఘురామ ను వదిలేసిన వైకాపా నేతలు.. ఇక తప్పదని ఎదురుదాడికి దిగినట్లున్నారని చర్చించుకుంటున్నారు.

ఇదే క్రమంలో ఆ ఫ్లోని కంటిన్యూ చేసిన భరత్… ఎంపీ రఘురామ బఫూన్, అరిటాకు, శిఖండి అంటూ వ్యాఖ్యానించారు. “నువ్వు దేహీ అని అడుక్కుంటే సీఎం జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారు. తీరా గెలిచాక శిఖండి చేష్టలు చేస్తున్నావు. నువ్వు రాజమండ్రిలో టీడీపీ నుంచో, జనసేన నుంచో పోటీ చేస్తావని అంటున్నారు. చెయ్యి.. నువ్వో నేనో చూసుకుందాం. లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచి చూపిస్తా. నరసాపురంలో అడుగు పెట్టే ధైర్యం లేదు. రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తావా? పుట్టుకతోనే శ్రీమంతుడినైన నాపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. నీలా నేను బ్యాంకులకు సొమ్ము ఎగ్గొట్టలేదు” అని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు రాజమండి ఎంపీ!

దీంతో… ఇంతకాలం రఘురామ కృష్ణంరాజు ఏ విమర్శలు చేసినా భరించిన వైకాపా నేతలు.. ఇకపై ఒక్కొక్కరుగా రంగంలోకి దిగి తలంటడం ఖాయమనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి!

Combat Of Words Between Raghu Rama Krishna Raju,Margani Bharat | Vaathavaani