వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి జ్ఞానోదయం అయ్యింది. ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఇకపై కౌంటర్ ఎటాక్ ఇచ్చేది లేదంటున్నారు. అంతేనా, విజయసాయిరెడ్డిపై తనకు తానుగా విమర్శలు చేయబోనని కూడా చెప్పారు.
‘అస్త్ర సన్యాసం చేస్తున్నాను..’ అని ప్రకటించేశారు రఘురామకృష్ణరాజు. అంటే, వైసీపీతో రాజీకి వచ్చేసినట్లేనా.? అలాగే అనుకోవాలి ప్రస్తుతానికి. ఇంతలా జ్ఞానోదయం రఘురామకి ఎలా అయి వుంటుందబ్బా.? అని వైసీపీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి.
ఏమో, తెరవెనుకాల ఏం జరిగిందోగానీ.. అధికార పార్టీతో పోరాటం చేయడం సాధ్యం కాదని రఘురామకి మొదట్లోనే ఆయన సన్నిహితులు చాలామంది సూచించారట. కానీ, ఆయనే మొండిగా వెళ్ళారు.. చీతక్కొట్టించుకున్నారు (సీఐడీ తనను చావబాదిందని ఆయనే స్వయంగా చెప్పారు మరి). అవసరమా ఇవన్నీ.?
ఎంతలా రఘురామ గొంతు చించుకుంటున్నా దాని వల్ల ఆయనకు అదనంగా ఒరిగిన లాభమేమీ లేదు. అదే, వైసీపీలోనే ఎలాంటి గొడవా లేకుండా కొనసాగి వుంటే.. ఈపాటికి రఘురామకి ఏదో ఒక కీలక పదవి వచ్చి వుండేదే.! ఇంతకీ, రఘురామకి జ్ఞానోదయం అయిన మాట వాస్తమేనా.? కట్ అండ్ పేస్ట్ తరహాలో ఏదో వీడియోకి చిన్న కటింగ్ ఇచ్చి వైసీపీ శ్రేణులు ‘అస్త్ర సన్యాసం’ వీడియో వదిలాయనుకోవాలా.?
రఘురామ మామూలుగా అయితే మారే మనిషి కాదు.!