ఏపీరాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజుది ఒక భిన్నమైన వైఖరి! వైసీపీ జెండాపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి గెలిచిన ఆర్.ఆర్.ఆర్…. అనంతరం తన గెలుపులో జగన్ కంటే తనపాత్రే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. అనంతరం కాలంలో పార్టీకి దూరమయ్యారు.. దూరమవ్వడమే కాకుండా టీవీల్లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తీసుకునే పలు నిర్ణయాలను తప్పుపట్టిన ట్రిపుల్ ఆర్… ఇప్పుడు పూర్తిగా చంద్రబాబు మనిషైపోయారని అంటున్నారు. ఇదే సమయంలో… చంద్రబాబు శ్రీకృష్ణుడు, పవన్ కల్యాణ్ అర్జునుడు అనే కామెంట్లు సైతం రఘురామకృష్ణంరాజు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రజనీకాంత్ “జైలర్” సినిమా తెరపైకి తెచ్చారు. అందులో పీఎం, ఏపీ సీఎం లకు క్యారెక్టర్లు సృష్టించారు!
ఇటీవల విడుదలైన “జైలర్” సినిమాలో నిజాయితీపరుడైన తండ్రి నిజాయితీని అడ్డుపెట్టుకుని ఆయన కొడుకు డ్రామాలు ఆడతాడు.. విగ్రహాలు దొంగిలించి విదేశాలకు స్మగ్లింగ్ చేసే బ్యాచ్ తో కలుస్తాడు. చివర్లో తన తండ్రినే చంపాలని తుపాకీ ఎత్తుతాడు. దీంతో తండ్రి సైగతో చనిపోతాడు. సరిగ్గా ప్రధాని మోడీ విషయంలో జగన్ అలాంటి కుమారుడే అని రఘురామకృష్ణం రాజు అభివర్ణిస్తున్నారు.
ఇందులో భాగంగానే “జైలర్” చిత్రంలో ఉన్నతాధికారిగా ఉన్నతమైన స్థానంలో ఉన్న రజినీకాంత్ కుమారుడు.. పోలీస్ ఆఫీసర్ గా మంచి పొజిషన్ లో ఉండి కూడా దొంగతనాలు చేస్తుంటాడని.. ఆ విషయం తెలిసి అతన్ని చంపాలని ఆదేశిస్తారని.. ఏపీలో రేపు అటువంటి దృశ్యమే పునరావృతం కావచ్చని చెబుతున్నారు ఆర్.ఆర్.ఆర్.!
ఇదే క్రమంలో… ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు జగన్ తన పేరునో లేదా తన తండ్రి వైఎస్ పేరునో పెట్టుకోవడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం “పీఎం కిసాన్”కి “వైఎస్సార్ రైతు భరోసా” అని రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసిందని, వైఎస్సార్ రైతు భరోసా పేరును తాటికాయంత అక్షరాలతో ముద్రించి, పీఎం కిసాన్ అనే పేరును అతి చిన్నగా ముద్రిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అదేవిధంగా… కేంద్ర ప్రభుత్వ పథకానికి ప్రచారం కల్పించే ప్రకటనల్లో ఓ వైపు ప్రధానమంత్రి ఫొటో, మరో వైపు ముఖ్యమంత్రి ఫొటో వేసుకోవచు కానీ… జేబులో నుంచి సొమ్ము తీసి ఇచ్చినట్లుగా బిల్డప్ ఇస్తూ.. తన తండ్రి ఫొటో, తన ఫొటో ముద్రించుకోవడం ఆశ్చర్యంగా ఉందని రఘురామ కృష్ణం రాజు అన్నారు. ఇది ఈయన చెబుతున్న ఏపీలో జైలర్ కథ!