వైఎస్ జగన్ బెయిల్ రద్దయితే ఏమవుతుంది.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దాదాపు 30కి పైగా కేసులు ఆయన మీద వున్నాయంటూ పదే పదే రాజకీయ ఆరోపణలు రావడం చూస్తున్నాం. ఇవేవీ ఉత్త ఆరోపణలు కావు, నిజంగానే ఆయన మీద కేసులున్నాయ్.

ఆయా కేసుల్లో ఏ1 నిందితుడిగా వున్నారు వైఎస్ జగన్. ప్రస్తుతం ఆయన బెయిల్ మీదున్నారు. విదేశాలకు వెళ్ళాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖచ్చితంగా న్యాయస్థానం నుంచి అనుమతి పొందాల్సిందే. గతంలో అయితే, ప్రతి శుక్రవారం ఆయన కోర్టులో విచారణకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి అయ్యాక దొరికిన ప్రత్యేక వెసులుబాట్లతో ఆయన కోర్టుకు హాజరు కావడంలేదు.

సరే, న్యాయ ప్రక్రియలో.. బెయిల్ పొందడం అనేది సర్వసాధారణం. మెరిట్స్ ఆధారంగా బెయిల్ లభిస్తుంటుంది. అయితే, ఇన్నేళ్ళుగా వైఎస్ జగన్ బెయిల్ మీదనే వుండటం, ఆయా కేసుల విచారణ నత్తనడకన సాగుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇదిలా వుంటే, వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోరుతూ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం వైఎస్ జగన్ అలాగే సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ‘ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా.?’ అని న్యాయస్థానం పిటిషనర్ రఘురామకృష్ణరాజుని అడిగిందట.

‘నోటీసులు ఇచ్చి, తదుపరి చర్యలు తీసుకోవాలంటూ’ పెద్ద మనసుతో రఘురామకృష్ణరాజు కోర్టుకు విన్నవించుకున్నారట. ఇంతకీ, వైఎస్ జగన్ బెయిల్ రద్దయితే ఏమవుతుంది.? ఇంకేమవుతుంది.! వైఎస్ జగన్ మళ్ళీ జైలుకు వెళతారు.! కానీ, కేసు విచారణ ఏళ్ళ తరబడి సాగే పరిస్థితి వున్నప్పుడు, కేవలం నిందితుడిగా ఆయన్ని ఎన్నాళ్ళు న్యాయస్థానం అయిన జైల్లో వుంచగలుగుతుంది.?

ఇది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే కాదు, చంద్రబాబు సహా రాజకీయ నాయకులందరికీ వర్తిస్తుంది. వ్యవస్థలోని లోటుపాట్లు.. విచారణ సంస్థల అలసత్వం, వీటికి తోడు రాజకీయ ఒత్తిళ్ళు.. ఇవన్నీ జగమెరిగిన సత్యాలే మరి!