వంగవీటిని భగవంతుడే చల్లగా చూడాలి

అవును మీరు చదివింది నిజమే. తండ్రి వంగవీటి రంగా పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్న వంగవీటి రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది. వారసత్వంగా రాజకీయాల్లో రావాలనుకునే వారసులకు  టేకాఫ్ చాలా ముఖ్యం. అంటే టేకాఫ్ బాగున్నంత మాత్రాన వారసులందరూ బ్రహ్మాండంగా వెలిగిపోతున్నారని కాదులేండి. కానీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్ధానమున్న విజయవాడలో వంగవీటి రాధాకు మాత్రం టేకాఫ్ బాగానే  జరిగింది. కానీ దాన్ని రాధా సక్రమంగా పైకి తీసుకెళ్ళలేదనే చెప్పుకోవాలి. అందుకనే రాధా భవిష్యత్తు గాలిలో దీపంలాగ అయిపోయింది.

 

బుధవారం వంగవీటి రంగా 30వ వర్ధంతి బ్రహ్మాండంగా జరిగింది. ఆ కార్యక్రమానికి వైసిపిలోని ప్రముఖనేతలవరూ హాజరుకాలేదు. టార్చిలైట్ వేసి చూసినా ఎక్కడా ఒక్క వైసిపి జెండా కూడా కనబడలేదు. పోని ఇతర పార్టీల్లోని రంగా అభిమానులైనా వచ్చారా అంటే వాళ్ళూ ఎవరూ కనబడలేదు. మళ్ళీ వన్ టౌన్లో జరిగిన రంగా వర్ధంతికి మాత్రం సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొనటం గమనార్హం. అదే విధంగా రంగా సొంతూరు కాటూరులో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో రంగా భార్య వంగవీటి రత్నకుమారితో కలిసి వైసిపి ఎంఎల్ఏ కొడాలి నాని, గన్నవరం ఇన్చార్జి యార్గగడ్డ వెంకట్రావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి యలమంచిలి రవి పాల్గొన్నారు. అంటే రంగాతో మాత్రమే వేదికను పంచుకోలేదు. అందుకే వర్ధంతిలో రాధా మాట్లాడుతూ, తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందంటూ నిర్వేదంగా చెప్పారు.

 

ఎంతో ఘన చరిత్రున్న రంగా వారసునిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన రాధా 2004లో విజయవాడ సెంట్రల్ నుండి కాంగ్రెస్ తరపున ఒక్కసారి మాత్రమే గెలిచారు.  2009లో పిఆర్పి తరపున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2014లో వైసిపి తరపున పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ 2019లో సెంట్రల్ నుండే పోటీకి రెడీ అవుతున్న రాధాను విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి కానీ మచిలీపట్నం ఎంపిగా గానీ పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.  రెండు చోట్ల పోటీ చేయటం రాధాకు ఇష్టం లేదు.

 

అదే సమయంలో పై నియోజవర్గాలను రాధా పట్టించుకోకపోవటంతో మచిలీపట్నం ఎంపి స్ధానంలో బాలశౌరి, విజయవాడ తూర్పులో యలమంచిలి రవి కార్యక్రమాలతో చొచ్చుకుపోతున్నారు. దాంతో క్యాడర్లో గందరగోళం మొదలైంది. ఇటువంటి పరిస్దితుల్లోనే రాధాను టిడిపిలోకి లాక్కోవాలని టిడిపి సెంట్రల్ ఎంఎల్ఏ బోండా ఉమా లాంటి వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారు. అంతే కాకుండా కాపు నేతలు కొందరు జనసేనలో చేరామంటూ సలహా ఇస్తున్నారు. టిడిపి, జనసేనపై రాధాకు పెద్దగా నమ్మకం ఉన్నట్లు లేదు. అలాగని తాను కోరుకుంటున్న సెంట్రల్ నియోజకవర్గం దక్కేట్లు లేదు. అందుకే ఏం చేయాలో దిక్కుతోచక భవిష్యత్తును కాలానికే వదిలేశారు రాధ.