అందరి నలుపు గురించి మాట్లాడే గురివింద గింజ.. తన కిందున్న నలుపు ఎరుగదని సామెత. ఇది గతంలో ప్రముఖ మీడియా అధిపతి విషయంలో ఎక్కువగా వాడుతుండేవారు. చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్న చందంగా వ్యవహరిస్తారంటూ కామెంట్లు వినిపించేవి. ఆ సంగతి అలా ఉంటే… తాజాగా పురంధేశ్వరి విషయంలో కూడా ఈ గురివింద గింజ సామెత కరెక్ట్ గా సెట్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.
అవును… ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచీ పురందేశ్వరి ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీలో అప్పుల గురించి అదేపనిగా విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులకంటే జగన్ సర్కార్ చేసిన అప్పులు తక్కువ అని కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు.
అయినప్పటికీ పురందేశ్వరి మాత్రం తగ్గడం లేదు. ఏపీ సర్కార్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా స్పందించారు. ఏపీలో అప్పులపై స్వయంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ గోళ ఏమిటి అంటూ కాస్త సీరియస్ గానే స్పందించారు. స్వప్రకటిత ఆర్ధికవేత్తలతో ఇబ్బంది అంటూ ఎద్దేవా చేశారు.
ఈ సమయంలో పురందేశ్వరి విమర్శల్లోని గురివింద గింజ నీతిని తెరపైకి తెస్తున్నారు రాజకీయ విమర్శకులు. ఏపీలో అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని పురందేశ్వరి అడగడం సంగతి కాసేపు పక్కనపెడితే… నరేంద్ర మోడీ హయాంలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన అప్పుల గురించి పురందేశ్వరికి ఏమైనా సమాచారం ఉందా అని అంటున్నారు విశ్లేషకులు.
స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి 2014 వరకు వివిధ ప్రభుత్వాలు చేసిన అప్పు రూ. 56 లక్షల కోట్లు కాగా… ప్రస్తుతం కేంద్రం అప్పులు సుమారు 157 లక్షల కోట్ల రూపాయలు. అంటే… కేవలం పదేళ్ళల్లో మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం సుమారు కోటి కోట్ల రూపాయలు అప్పు చేసిందన్నమాట. మరింత క్లియర్ గా చెప్పాలంటే… 67 సంవత్సరాల్లో వివిధ ప్రభుత్వాలు 56 లక్షల కోట్లు అప్పుచేస్తే.. పదేళ్ళల్లోనే మోడీ ప్రభుత్వం ఒక్కటే రూ.కోటి కోట్లు అప్పుచేసింది.
దీంతో ఏపీ అప్పులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని జగన్ ను డిమాండ్ చేస్తున్న పురందేశ్వరి… కేంద్రం చేసిన అప్పులపై ఎందుకు మాట్లాడటంలేదు అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. ఇదే సమయంలో కోటి కోట్ల రూపాయల అప్పులు చేసిన మోడీ ప్రభుత్వం ఆ మొత్తాన్ని దేనికెంత ఖర్చుపెట్టిందో జనాలకు పురందేశ్వరి వివరించి చెప్పగలరా అని నిలదీస్తున్నారు.
రాష్ట్రాల అప్పులపై కేంద్రం పార్లమెంటులో వివరణ ఇస్తోంది.. అయినా బీజేపీ నేతలు సంతృప్తి చెందడం లేదు. మరి పరిమితికి మించి కేంద్రప్రభుత్వం చేస్తున్న అప్పులను ఎవరు నియంత్రించాలి అనేది ఈ సందర్భంగా మరింత చర్చనీయాంశం అయ్యింది. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తు, ఇంకోవైపు విచ్చలవిడిగా చేస్తున్న అప్పులకు పురందేశ్వరి సమాధానం చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నారు.
అయితే పురందేశ్వరి మాత్రం ఈ విషయంలో నోరు మెదపలేరు అని అంటున్నారు పరిశీలకులు. దీంతో… ప్రస్తుతం పురందేశ్వరి బావ కల్లల్లో ఆనందం కోసం పనిచేస్తున్నారంటూ విజయసాయిరెడ్డి చేస్తోన్న విమర్శలను షేర్ చేస్తున్నారు!