అధికారులను తరుముకున్న జనాలు..ఎందుకో తెలుసా ?

ఈరోజు మొదలైన జన్మభూమి కార్యక్రమంలో స్ధానిక జనాలు అధికారులను తరుముకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల జన్మభూమి కార్యక్రమం మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే అధికారులు అనంతపురం జిల్లాలోని పుట్లూరు మండల కోమటికుంట్ల గ్రామానికి చేరుకున్నారు. అయితే, స్ధానికుల నుండి అధికారులకు ఊహించని రీతిలో పరాభవం ఎదురైంది.  నాలుగేళ్ళల్లో తమ గ్రామ సమస్యలు పరిష్కరించని అధికారులు ఇఫుడు మాత్రం ఎందుకు వచ్చారంటూ తిరగబడ్డారు. స్ధానికులకు అధికారులకు మాటమాట పెరిగటంతో తోపులాటకు దారితీసింది. సమస్యలు పరిష్కరించకపోవటమే కాకుండా నిలదీసినందుకు తమపైనే మండిపడతారా అంటూ జనాలు తిరగబడ్డారు.

 

 

వేదికమీదకు ఎక్కి బ్యానర్లను చించేశారు. పోస్టర్లను చించి పడేశారు. టెంట్లను లాగేశారు. వేసిన కుర్చీలను విసిరిసిరికొట్టారు. కొన్ని కుర్చీలను విరగొట్టేశారు. దాంతో అధికారుల్లో భయం మొదలైంది. స్ధానికులను అడ్డుకోబోయిన అధికారులపై విరుచుకుపడిన జనాలు చివరకు అధికారులను అక్కడి నుండి తరిమేశారు. దాంతో అధికారులు కూడా బతుకుజీవుడా అంటూ అక్కడి నుండి పారిపోయారు. పోయిన జన్మభూమి కార్యక్రమంలో కూడా రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు చాలానే జరిగాయి. చాలాచోట్ల టిడిపిలోనే ఉన్న వర్గాలు ఒక వర్గంపై మరో వర్గం నేతలు దాడులు చేసుకున్నాయి. మరికొన్ని చోట్ల రెండు వర్గాలు కలిసి అధికారులపై పడ్డాయి.

 

మొత్తానికి జన్మభూమిలో పాల్గొంటున్న అధికారులపై జనాలు తిరగబడటానికి ప్రధాన కారణం జన్మభూమి కమిటీలనే చెప్పాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు, రేషన్ కార్డులు, ఫించన్లు లాంటివి కేవలం జన్మభూమి కమిటీలు ఆమోదించిన వారికి మాత్రమే ఇవ్వాలని షరతులున్నాయి. దాంతో అధికారులు ఏమీ సమాధానం చెప్పలేక కమిటీలు సిఫారసు చేసిన వారికే వర్తింపచేస్తున్నారు. దాంతో కమిటిపై అన్నీ వర్గాల్లోను ఆందోళన మొదలైంది. జన్మభూమి కమిటీలపై వ్యతిరేకత జనాల్లో మాత్రమే కాదు టిడిపిలోని వర్గాల్లో కూడా పెరిగిపోయింది. దాంతో ఎక్కడ జన్మభూమి కార్యక్రమం జరిగినా అధికారులే బలైపోతున్నారు. ఇపుడుపుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలో జరిగింది కూడా అదే.