తొందరలోనే వైసిపిలో తిరుగుబాటు వస్తుందా ? మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. గతంలో అత్యధిక మెజారిటితో ఏర్పడిన రెండు ప్రభుత్వాలను తిరుగుబాటు చేసి ఎంఎల్ఏలే ప్రభుత్వాలను దింపేసిన విషయాన్ని ఉండవల్లి గుర్తు చేయటం గమనార్హం.
తమకు ప్రాధాన్యత దక్కటం లేదని ఎంఎల్ఏలు అనుకున్న కారణంగానే గతంలో 1972లో పివి నరసింహారావు, 1994లో ఎన్టీయార్ ప్రభుత్వాలను ఎంఎల్ఏలే దింపేసిన విషయాన్ని ప్రస్తావించారు. మొన్నటి ఎన్నికల్లో 151 సీట్ల అఖండ మెజారిటి వచ్చిందని సంబరపడటం కాదన్నారు. ఎంఎల్ఏల్లో అసంతృప్తి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపైనే ఉందని హెచ్చరించారు.
తాను మాత్రమే నీతిగా ఉంటే సరిపోదని అందరూ నిజాయితిగా పనిచేసేట్లు జగన్ చూసుకోవాలని సలహా ఇవ్వటం కరెక్టే. మంత్రి, ఎంపి డబ్బులు తీసుకున్నట్లు తెలియగానే వెంటనే జోక్యం చేసుకుని తీసుకున్న డబ్బును తిప్పి ఇప్పించేసినట్లు తాను విన్నట్లు చెప్పారు. జగన్ చేసిన పని మంచిదే కానీ జగన్ దృష్టికి ఎన్ని సంఘటనలు వస్తాయంటూ ప్రశ్నించారు.
మొత్తం మీద జగన్ ప్రభుత్వంపై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. అవినీతి విషయంలో జగన్ జాగ్రత్తగానే ఉంటున్నారు. కానీ ఉండవల్లి చెప్పినట్లు కొందరు మంత్రులు, ఎంఎల్ఏలు మాత్రం డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మరి వాళ్ళ విషయంలో ఏం చర్యలు తీసుకున్నది తెలియలేదు. అలాగే డబ్బు సంపాదన విషయంలో ఎంఎల్ఏల చేతులు కూడా కట్టేశారు. మరి ఇలా ఇంత కాలం కంటిన్యు అవుతుందో చూడాలి.