స్పీకర్ గా ఐదేళ్ళ పదవీ కాలంలో సీనియర్ నేత కోడెలశివప్రసాద్ ఎంత ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్నారో అర్ధమైపోయింది. పోలింగ్ సరళిని చూడటానికి వచ్చిన కోడెలను జనాలు తరిమికొట్టటం చూసి అందరూ విస్తుపోతున్నారు. 2014 ముందు కోడెల అంటే జనాల్లో మంచి అభిప్రాయమే ఉండేది. మరి ఏమైందో ఏమోగానీ 2014 ఎన్నికల్లో స్పీకర్ అయిన దగ్గర నుండి వ్యక్తిత్వంలో పూర్తి మార్పు వచ్చేసిందంటున్నారు టిడిపి నేతలే. కొడుకు శివరామకృష్ణ ఒకవైపు కూతురు విజయలక్ష్మి మరోవైపు తండ్రిని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించటంతో సమస్యలు మొదలైందంటున్నారు.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొడుకు సత్తెనపల్లిలో కూతురు నరసరావుపేటలో కౌంటర్లు ఏర్పాటు చేశారన్న ఆరోపణలు మొదలయ్యాయి. చివరకు ఆ ఆరోపణలు ఏ స్ధాయికి చేరుకున్నాయంటే జిఎస్టి, సిఎస్టీ లాగే పై రెండు నియోజకవర్గంలో అదనంగా కెఎస్టీ (కోడెల ట్యాక్స్) వసూలు చేస్తున్నారంటూ విపరీతమైన ఆరోపణలు మొదలయ్యాయి. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయంటే ఏదోలా మామూలే అనుకోవచ్చు. కానీ ఏకంగా టిడిపి నేతలే బహిరంగంగా ఆరోపించారంటేనే పరిస్ధితి ఎంతగా దిగజారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.
కొడుకు, కూతురు నిర్వాకం వల్ల పై రెండు నియోజకవర్గాల్లో కోడెలపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అందుకే మొన్నటి ఎన్నికలో కోడెలకు అసలు టికెట్ ఇవ్వద్దంటూ టిడిపి నేతలే ఏకంగా చంద్రబాబు ఇంటి ముందు ధర్నానే చేశారు. పై రెండు నియోజకవర్గాల్లోని టిడిపి నేతలు ఏకమై ఎక్కడా కోడెలకు టికెట్ ఇచ్చేందుకు లేదంటూ బహిరంగంగానే ప్రదర్శనలు, నిరసనలు చేసిన విషయం అందరూ చూసిందే.
ఇటువంటి నేపధ్యంలోనే చంద్రబాబు మళ్ళీ సత్తెనపల్లిలో కోడెలకు టికెట్ ఇచ్చారు. దాంతో జనాలకు ఒళ్ళు మండిపోయింది. అందుకే ఇనిమెట్ల పోలింగ్ కేంద్రంకు వచ్చిన కోడెలపై తమ కోపాన్ని చూపారు. పోలింగ్ కేంద్రంలోకి కోడెల ప్రవేశించటమే కాకుండా తలుపులు మూసుకుని కూర్చున్నారు. దాంతో రెండుగంటల పాటు పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. దాంతో జనాల్లో మంట మరింత పెరిగిపోయింది. మొత్తానికి పోలీసులు బలవంతంగా బయటకు తీసుకొచ్చిన కోడెలపై జనాలు తమ ప్రతాపాన్ని చూపించారు. వెంటపడి కోడెల కారును తిరిమేశారు.