జనసేనలోకి పృధ్వీరాజ్.! గోరంట్ల మాధవ్ కూడా.?

జనసేన పార్టీలో చేరబోతున్నారట పృధ్వీరాజ్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గత కొద్ది రోజులుగా జనసేన తరఫున వకాల్తా పుచ్చుకుంటున్న సినీ నటుడు పృధ్వీరాజ్, అంతకు ముందు వైసీపీలో పని చేశారు. వైఎస్ జగన్ వెంట పాదయాత్రలోనూ తిరిగారు. అందుకే, ఆయనకు ఎస్వీబీసీలో అవకాశం కల్పించారు వైఎస్ జగన్.

అయితే, ఎస్వీబీసీ వ్యవహారాలు చూసుకుంటున్న సమయంలోనే, ఓ మహిళతో అసభ్యకరంగా ఆయన ప్రవర్తించారనే ఆరోపణలు రావడంతో, ఆ పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత వైసీపీకి ఆయన దూరమయ్యారు. ఈ క్రమంలో మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెట్టి, మెగా కాంపౌండ్ అండతో కొన్ని సినిమాల్లో నటించారు పృద్వీరాజ్.

తాజాగా, జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన పృధ్వీరాజ్, వైసీపీ మీద తీవ్రాతి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. వైసీపీని ‘తీవ్రవాదుల్ని తయారు చేసే శిబిరం’గా అభివర్ణిస్తూ ఆ మధ్య వార్తల్లెక్కారు పృధ్వీరాజ్. అయితే, పృధ్వీరాజ్ వ్యాఖ్యల్ని వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పృధ్వీరాజ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా, స్థానిక జనసేన నాయకత్వం ఆ ప్రచారాన్ని ఖండిస్తుండడం గమనార్హం.

ఇదిలా వుంటే, పృధ్వీరాజ్ తరహాలోనే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా జనసేనలో చేరతారేమో.! అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ కూడా జనసేనలోకి వెళతారేమో.. అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తుండడం గమనార్హం. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, గోరంట్ల మాధవ్ కూడా ఆడియో, వీడియో లీకులతో వివాదాల్లోకెక్కిన సంగతి తెలిసిందే. అయితే వాళ్ళవెరూ వైసీపీని వీడే అవకాశం లేదు.