జగన్ పై తీవ్రస్ధాయిలో ఒత్తిడి

ప్రభుత్వ పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయానికి జగన్మోహన్ రెడ్డి కొంత కాలం పాటు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మామూలుగా అయితే ఏ ముఖ్యమంత్రి అయినా సచివాలయం నుండే విధులు నిర్వహిస్తారు. అంటే కెసియార్ లాంటి వాళ్ళకు ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది లేండి.

జూన్ నెల 10వ తేదీన అట్టహాసంగా సచివాలయంలో ప్రవేశించిన జగన్ ఇంతలోనే కొంతకాలం పాటు దూరంగా ఉండాలని ఎందుకు నిర్ణయించుకున్నారు ? ఎందుకంటే ఒత్తిళ్ళ నుండి తట్టుకోలేకేనట. వాస్తుప్రకారం మరమ్మతులు చేయించుకున్న తర్వాతే జగన్ సచివాలయంలోని తన చాంబర్లోకి ప్రవేశించారు. ఒకసారి క్యాబినెట్ సమావేశం కూడా జరిపారు.

అయితే ఈ మధ్యనే ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తమకు కావాల్సిన ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు ఉద్యోగులు సచివాలయానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రతీరోజు కొన్ని వేలమంది మంత్రులు, ఉన్నతాధికారుల పేషీలకు వస్తున్నారు. పనిలో పనిగా సిఎం కార్యాలయంకు కూడా వస్తున్నారు.

ఉద్యోగులకైతే నేరుగా సిఎంను కలిసే అవకాశం ఉండదు. అందుకనే ఉద్యోగులతో పాటు నేతలు కూడా వస్తున్నారు. బదిలీల సిఫారసులతో ప్రతిరోజు వందలాది నేతలు వస్తుండటంతో  ఆ ఒత్తిడిని జగన్ తట్టుకోలేకున్నారు. అందుకే అసలు సచివాలయానికే దూరంగా ఉండిపోతున్నారు. ఎలాగూ ఈనెల  11వ తేదీ నుండి అసెంబ్లీ మొదలవుతోంది. కాబట్టి ఈనెలాఖరు వరకూ సచివాలయానికి రావాల్సిన అవసరం కూడా ఉండదని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.