ఆంధ్రాలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ప్రస్తుతం పీకే అండ్ టీమ్ వైసీపీ కోసం పని చేస్తోంది. వైసీపీ అధినేత జగన్ ని సీఎం చేసే దిశగా వీరు వ్యూహ రచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీకే 2019 ఎన్నికల ప్రచారంలో తన భాగస్వామ్యం ఉండదంటూ వెల్లడించారు. ఆయన చేసిన ఈ ప్రకటన ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి పలు విషయాలపై మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఏ పార్టీతోనూ కలిసి పనిచేయనంటూ ప్రకటించారు. ప్రజలతో కలిసి క్షేత్ర స్థాయిలో కలిసి పని చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. గడిచిన నాలుగైదేళ్ల నుండి చూస్తున్న శైలిలో నేను ప్రచారం చేయను అని వెల్లడించారు. గత ఆరేళ్ళ కాలంలో నేను వివిధ రాజకీయ నాయకులతో పని చేశాను. ఈసారి నేను మొట్ట మొదట పని చేసిన గుజరాత్ లేదా నా సొంత రాష్ట్రం బీహార్ వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ తరపున ప్రచారం చేయను. రాజకీయాలకు దూరంగా ప్రజలతో కలిసి పని చేయాలి అనుకుంటున్నాను అని ప్రశాంత్ కిషోర్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన వైసీపీ ప్రచార వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. జగన్ బహిరంగంగానే ప్రశాంత్ కిషోర్ తమ పార్టీతో కలిసి పని చేస్తున్నట్టు తెలిపి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. ప్రత్యర్థులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశారు కూడా. ఇప్పటి వరకు వైసీపీలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర, నాయకులు అసెంబ్లీని వీడడం, సోషల్ మీడియాలో వైసీపీ జోరు ఇవన్నీ పీకే స్ట్రాటెజిలో భాగమే అనేది అందరి భావన.
ఈసారి ఎలాగైనా పీకే వ్యూహాలతో జగన్ సీఎం అవడం ఖాయం అని వైసీపీ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల్లో ప్రచారం చేయను, వైసీపీ నుండి నేను పెద్ద మొత్తంలో ఆర్ధిక ప్రయోజనం పొందలేదు వంటి విషయాలు ఆయన వెల్లడించటంతో త్వరలోనే పీకే వైసీపీతో బంధం తెంచుకోనున్నట్టు స్పష్టమవుతుంది. పీకే చేసిన ఈ వ్యాఖ్యలతో వైసీపీ వర్గాల్లో కొంతమేర నిరుత్సాహం నెలకొన్నట్టు తెలుస్తోంది. పీకే పార్టీకి దూరం అయినప్పటికీ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు. ప్రజాసంకల్ప యాత్రకి ఎంతో ఆదరణ లభిస్తోంది. విజయం మాదే అంటూ ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు కొందరు వైసీపీ నాయకులు.
అంతేకాదు ఆయన రాజకీయాల్లోకి రానున్నట్టు వస్తున్న వార్తలను కూడా ప్రశాంత్ కిషోర్ ఖండించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి పీకే కీలక పాత్ర పోషించారు. 2015 మార్చి తర్వాత మోడీని ఇప్పటి వరకు కలవలేదన్నారు. కాగా గతేడాది తన తల్లి మరణించిన సమయంలో తనతో మోడీ మాట్లాడినట్టు వెల్లడించారు. తనకి ప్రధాని మోడీతో విభేదాలు రావడానికి కారణం ప్రభుత్వంలో చేరిన కొంతమంది అని ఆయన పేర్కొన్నారు. ఆ విభేదాల కారణంగానే బీజేపీని వీడినట్టు తెలిపారు.
పోయిన సంవత్సరం యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పని చేశారు పీకే అండ్ టీమ్. కానీ కాంగ్రెస్ అపజయం పాలయ్యింది. అయితే కాంగ్రెస్ పార్టీ తిరిగి పట్టు సాధించడం రాజకీయాల్లో అతి పెద్ద సవాల్ అని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ స్థానంలో ప్రియాంక గాంధీ అధ్యక్షత బాధ్యతలు తీసుకోవాలి అనే వాదనలు సరికావు అని పీకే అన్నారు. రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకుండానే ఇతరులు నాయకత్వం వహించాలి అని మాట్లాడటం సబబు కాదని అన్నారు.