రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది సీఎం పీఠాన్ని అధిష్టాంచాలని దృఢంగా నిశ్చయించుకున్నారు ఆంధ్ర ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దీనిపై ఆయన అనేక కసరత్తులు చేస్తున్నారు. అందుకోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని కూడా నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో పీకే కి చాలా పెద్ద మొత్తంలో డబ్బు కూడా అందించినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా ప్రశాంత్ స్పందించారు
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ లో ఆదివారం జరిగిన ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ లీడర్ షిప్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీకే తన రాజకీయ భవిష్యత్తు గురించి, రానున్న కాలంలో తన కార్యాచరణల గురించి మాట్లాడారు. తనపై వచ్చిన అనేక ఊహాగానాలకు ఈ సందర్భంగా ఆయన క్లారిటీ ఇచ్చారు.
యూపీ ఎన్నికల తర్వాత మా సంస్థ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తుంది. ఈ విషయం అందరికి తెలుసు. కాగా వైసీపీ కోసం పని చేయటానికి మా కంపెనీ ఆర్ధికంగా జగన్ నుండి పెద్ద మొత్తం పొందినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ వట్టి పుకార్లేనని, ఇందులో ఎటువంటి వాస్తవం లేదని పీకే వెల్లడించారు.
మీడియాలో నాకు జగన్ 300 నుండి 400 కోట్లు ఇచ్చి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా నియమించుకున్నట్టు ప్రచారం జరిగింది. అవన్నీ నిజం కాదు. కేవలం రూమర్స్ అంటూ స్పష్టం చేశారు ప్రశాంత్ కిషోర్. మా సంస్థ వనరుల కొరతతో ఇబ్బంది పడుతుందంటూ ఆయన చెప్పటం విశేషం.
పంజాబ్ లో అమరేందర్ సింగ్, బీహార్ లో నితీష్ కుమార్ దగ్గర ఎలక్షన్స్ సమయంలో సరిపడ నిధులు లేవని పీకే వెల్లడించారు. అయితే ఎప్పటి నుండో టీడీపీ వర్గాల్లోనూ, వైసీపీ వర్గాల్లోనూ జగన్, పీకే కి ఎంత ప్యాకేజి ముట్టజెప్పారో అని చిన్నపాటి చర్చ జరుగుతూ ఉంది. పీకే పెద్ద మొత్తంలోనే డిమాండ్ చేసి ఉంటాడు అని ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే వీటిమీద ఎప్పుడూ స్పందించని పీకే తొలిసారిగా నోరు విప్పడం, అది కూడా పెద్ద మొత్తంలో ఆర్ధిక ప్రయోజనం పొందలేదు అని చెప్పడం చర్చనీయాంశమైంది.