మిర్యాలగూడ అమృతకు షాకిచ్చిన పోలీసులు

మిర్యాలగూడ అమృతకు పోలీసు శాఖ నుంచి చుక్కెదురైంది. హత్యకు గురైన ప్రణయ్ విగ్రహాన్ని మిర్యాలగూడలో పెట్టేందుకు అనుమతులు లేవని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. ప్రణయ్ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ విషయం పై పోలీసుల వివరణ కోరింది.

సంబంధిత అధికారుల అనుమతి లేకుండా మిర్యాలగూడ లో ప్రణయ్ విగ్రహాన్ని పెట్టేందుకు వీలు లేదని ప్రణయ్ తండ్రికి స్పష్టం చేశామని పోలీసులు తెలిపారు. ఈ వివరాలను పరగణలోకి తీసుకున్న కోర్టు ప్రణయ్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తు దాఖలైన  పిటిషన్ ను కొట్టేసింది. ప్రణయ్ విగ్రహం పెట్టాలన్న అమృత కోరిక నెరవేరేలా కనిపించడం లేదని పలువురు చర్చించుకున్నారు. 

 మిర్యాలగూడలో ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అమృత, ప్రణయ్ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. దీనిని సహించని అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ ని కిరాయి హంతకులతో హత్య చేయించారు. అమృత వైశ్య వర్గానికి చెందినది కాగా ప్రణయ్ దళిత సామాజిక వర్గానికి చెందిన వాడు. దీంతో ప్రణయ్ హత్య సంచలనమైంది. ప్రణయ్ హత్యను దళిత, ప్రజా, రాజకీయ సంఘాలు ఖండించాయి. నిందితులను కూడా పోలీసులు పట్టుకొని రిమాండ్ చేశారు.

తన తండ్రి మారుతీరావు హత్య చేయించారని తెలుసుకున్న అమృత తన తండ్రిని ఉరి తీయాలని డిమాండ్ చేసింది. అలాగే ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా సమాజంలో కులం అనేది చావాలని అమృత తెలిపింది. ప్రణయ్ విగ్రహ ఏర్పాటు పై పెద్ద చర్చే నడిచింది.

ప్రణయ్ విగ్రహ ఏర్పాటును కొత్త మంది వ్యతిరేకించగా మరికొంత మంది సపోర్టు చేశారు. దీని పై భిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఇంకా అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు. వింతగా పటాన్ చెరువుకు చెందిన జంట ప్రణయ్ విగ్రహాన్ని పెట్టవద్దని పెడితే అతని ఆత్మ అందులో బంధి అయి ఉంటదని చెప్పారు. దీంతో వారి పై అనుమానం వ్యక్తం చేసిన అమృత పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు పలు దశలుగా మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం అమృత ఆరు నెలల గర్భిణి. ఆమె తన తండ్రి ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదని ప్రణయ్ హత్య నిందితులకు శిక్ష పడే వరకు తాను పోరాడుతానని తెలిపింది.