చంద్రబాబు ఎంత ఈజీగా మాట మార్చేసారో చూడండి

‘హైదరాబాద్‌ నా కష్టం.. దాన్ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే. దాన్ని నేనే కట్టాను. నా కష్టాన్ని ఈరోజు తెలంగాణ అనుభవిస్తోంది’ ఇన్నాళ్లూ చంద్రబాబు చెప్పిన మాటలివి. తాను లేకపోతే హైదరాబాద్‌ లేదంటూ ప్రతి రోజూ చెప్పుకున్న ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ బాబు గారు తాజాగా ఆ వ్యాఖ్యల్ని సవరించుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

హైదరాబాద్‌ను తాను కట్టలేదని తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆయన పదేపదే వివరణ ఇచ్చుకుంటున్నారు. హైదరాబాద్‌ను నిర్మించానని తానెప్పుడూ, ఎక్కడా చెప్పలేదని రెండురోజులుగా ప్రతి సభలోనూ జనాన్ని బ్రతిమిలాడుకుంటున్నారు. నాలుగున్నరేళ్లుగా ఏపీలో జరిగిన ప్రతి కార్యక్రమంలోనూ హైదరాబాద్‌ తన కష్టార్జితమని చెప్పుకున్న ఆయన తెలంగాణకు వెళ్లి మాట మార్చడంతో ఇప్పుడు అదే జనం ముక్కును వేలేసుకుంటున్నారు.

చంద్రబాబు ఇలా ఉన్న పళాన మాట మార్చేయడానికి కారణం కేసీఆర్‌. బాబు ఎచ్చులకుపోయి చెప్పుకున్న మాటలను ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ ఏకిపడేయడం మొదలుపెట్టారు. హైదరాబాద్‌ను కట్టింది తానేనని బాబు చెప్పుకుంటున్నాడని, మరి కులీ కుతుబ్‌షా ఏంకావాలని, ఆయన ఆత్మహత్య చేసుకోవాలా అని ఎన్నికల సభల్లో సెటైర్లు వేస్తున్నాడు. హైదరాబాద్‌ తానే కట్టానంటున్నాడు మరి చార్మినార్‌ కూడా ఆయనే కట్టాడా అని కేసీఆర్‌ సంధించిన ప్రశ్నకు టీడీపీ ఉక్కిరిబిక్కిరై చివరికి తాను అలా అనలేదని స్వయంగా బాబే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.    సైబరాబాద్‌ను అభివృద్ధి చేశానని మాత్రమే తాను చెప్పానని బాబు సన్నాయి నొక్కుల నొక్కుతున్నారు. హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు ప్రతిపాదన కూడా కాంగ్రెస్‌ హయాంలోనే వచ్చిందని రాహుల్‌గాంధీ సమక్షంలో చంద్రబాబు చెప్పడం చర్చనీయాంశమైంది. మరి ఇన్నాళ్లూ రింగు రోడ్డు కూడా తన ఘనతే అని ఎందుకు చెప్పుకోవాల్సివచ్చిందనే ప్రశ్నకు సమాధానం లేదు.

ఏ ఎండకు ఆ గొడుగు పట్టే సామెతకు నిలువుటద్దం చంద్రబాబని ఆయన ప్రత్యర్థులు ఎప్పుడూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆది నిజమని తెలంగాణ ఎన్నికల సాక్షిగా బాబే స్వయంగా నిరూపించుకున్నారు. తన రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా దిగజారడం, ఎలాంటి సర్దుబాటుకైనా తెగించడం ఆయన నైజం. అందుకే ఇన్నాళ్లూ గొప్పలకు పోయి చెప్పకున్న మాటలను తెలంగాణలో సమర్థించుకోలేక డీలా పడి తానలా అనలేదని వివరణ ఇచ్చుకోవాల్సివచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

దీంతో తన ప్రత్యర్థులకు తానే ఆయుధాన్నిచ్చిట్లయింది. బాబు ప్రత్యర్థి రాజకీయ వర్గాలు, సోషల్‌ మీడియాలో రెండు ఫొటోలు విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. కాంగ్రెస్‌ నాయకురాలు గంగాభవాని బాబు మెడలో కాంగ్రెస్‌ కండువా కప్పుతుంటే ఆయన నవ్వుతూ వేయించుకోవడం ఒకటి కాగా, ఇన్నాళ్లూ బద్ధ శత్రువుగా చెప్పిన కాంగ్రెస్‌కు చెందిన సీనియర్‌ నేత గులాం నబీ అజాద్‌తో చేతిలో చేయి వేసి మాట్లాడుండడం రెండోది. మొన్నటివరకూ ప్రధాని మోడీ, బీజేపీ నేతలతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగి వారిని ఆకాశానికి ఎత్తిన బాబు ఇప్పుడు తన ప్రయోజనాల కోసం రాహుల్‌గాంధీ అడుగులో అడుగు వేస్తుండడం, కాంగ్రెస్‌ నాయకులు తన ఆత్మబంధువులని చెప్పడం, మహాకూటమి గెలుపు చారిత్రక అవసరమని ప్రచారం చేయడంపై విపరీతంగా సెటైర్లు ట్రెండ్‌ అవుతున్నాయి.

చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు, ఆయన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి నేరుగా వేదికలు పంచుకోవడం, గతంలో అన్న మాటల్ని అనలేదనడం పట్టిచూపిస్తున్నాయి.