జగన్ పై హత్యాయత్నం కేసు- మసి పూసి మారేడు కాయ చేస్తున్నారు

                                             (యనమల నాగిరెడ్డి)

“నిజం దేవుడెరుగు. నీళ్లు పల్లమెరుగు” ఇది పాతకాలం నాటి పెద్దలు చెప్పిన సామెత.  అయితే ప్రస్తుతం అందుకు విరుద్ధంగా “నిజం నాయకులెఱుగు. నీళ్లు మిట్టకెక్కు” అన్నది నేడు మన రాజకీయ నాయకులు పాత సామెతకు భాష్యం చెపుతూ, ఆచరిస్తున్న నూతన సామెత.

జగన్ పై విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో జరిగిన “కత్తి పోటు దాడి ఘటనను” పాలక, ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు “రాజకీయాలకోసమే” ఉపయోగించుకుంటూ జనాన్ని ‘ఎర్రిపప్పలను’ చేస్తూ, నిజం వెలుగు చూడకుండా దానికి మసిపూసి మారేడు కాయ చేస్తూ నిజం బయట పడకుండానే పాతర వేసేశారు. ఈ సంఘటన జరిగిన వెంటనే (స్వామీ భక్తో,లేక అందిన సమాచారమో, అల్లర్లు జరుగుతాయనే ఆందోళనో  తెలియదు కానీ) డిజిపి ఠాకూర్ ప్రకటన చేయడంలో చూపిన అత్యుత్సాహము, వెను వెంటనే, ముఖ్యమంత్రి, గవర్నర్, తెరాస, ఇతర రాజకీయ పార్టీలు స్పందించడం, జగన్ పోలీసులకు పిర్యాదు చేయకుండా, హైదరాబాద్ లో ఆసుపత్రిలో చేరిన తర్వాత వైస్సార్ పార్టీ నాయకులు చేసిన హడావుడి అన్నీ కలగలసి ఈ సంఘటనలో వాస్తవాలు మరుగున పడేటట్లు చేశాయి.

రాజకీయాలలో నిరంతరం మునిగి తేలుతున్న ఈ ఘనులు ప్రతినిత్యం ప్రజా సంక్షేమం గురించి “గొంతు మాత్రం” చించుకుంటూ ఉంటారు. అయితే నిద్రలో కూడా  “తమ ప్రయోజనాల గురించి” మాత్రమే ఆలోచిస్తారు. అందుకోసమే పని చేస్తారు. అందులో భాగంగా నిజాలకు పాతర వేయడం, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సృష్టిస్తారు. అదే క్రమంలో జగన్ పై దాడి ఘటనను కూడా వైస్సార్ కాంగ్రెస్, టీడీపీ తో సహా అన్ని రాజకీయ పార్టీలు,  నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేటందుకే ఉపయోగించుకున్నారు. వాస్తవాలను మరుగు పరచడంలో విజయం సాధించారు.

 

జగన్ రెడ్డి ఆరోపణ    

“తనపై జరిగిన దాడి ముఖ్యమంత్రి చంద్రబాబు చేయించిన హత్యాయత్నమే” నని జగన్ నిన్నవిజయనగరం యాత్రలో చేసిన విస్పష్ట ప్రకటన మరోసారి ‘రాజకీయ అస్తిత్వ పోరాటానికి’ తెర తీసింది. తాను  పాదయాత్ర ప్రారంభినప్పటి నుండి చంద్రబాబు గుండెల్లో గుబులు ప్రారంభమైందని, అది పెరిగి మార్చి నాటికి మహావృక్షమైందని, అప్పటి నుండి చంద్రబాబు నాయుడు తనపై హత్యా యత్నానికి స్కెచ్ వేయడానికి శ్రీకారం చుట్టారని జగన్ ఆరోపించారు. ఆ ప్రయత్నం చివరకు విశాఖపట్టణంలో  కార్యరూపం దాల్చిందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఆలోచనలు సక్రమంగా ఉండి ఉంటే ఆయన ఈ ఘటనపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించేవారని జగన్ అంటున్నారు. చంద్రబాబే ఈ కుట్రకు సూత్రధారి కాబట్టి, తన భాగోతం బట్టబలు అవుతుందన్న భయంతోనే ఆయన స్వతంత్ర సంస్థలతో దర్యాప్తుకు అంగీకరించక పోగా, ఆయా సంస్థలను రాష్ట్రంలో అడుగు పెట్టకుండా నిషేధం విధించారని జగన్ తో పాటు ఆయన అంతే వాసులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు ప్రభుత్వ వైఖరి బలం చేకూరుస్తున్నది.

 

డీజీపీ అత్యుత్సాహము

రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించి, జరిగిన సంఘటనలపై నిస్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవలసిన పోలీసు బాసు ఆర్.పి. ఠాకూర్ చేసిన తొందరపాటు ప్రకటన ఈ సంఘటనను వివాదాల సుడిగుండంలోకి నెట్టింది. అలాగే  రాజకీయ రంగు పులిమింది. ఠాకూర్ తాను పని చేసిన అన్ని విభాగాలలోనూ తనదైన ముద్ర వేసి, ఏసీబీ డీజీపీగా తన సామర్త్యాన్ని నిరూపించుకున్నారు. అంత అనుభవమున్న అధికారి ఈ తొందరపాటు ప్రకటన ఎందుకు చేశారన్నది చర్చనీయాంశంగా మారింది.

డీజేపీ పదవి కట్టబెట్టిన చంద్రబాబుకు రాజకీయంగా దెబ్బ తగలకుండా చూసి, తన స్వామిభక్తి ప్రకటించుకోవడానికే ఠాకూర్ ఈ ప్రకటన చేశారని, కేసు తీవ్రతను నీరు కార్చడానికి ప్రయత్నించారని వైస్సార్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అలాగే ఎయిర్ పోర్టులో సి.ఐ.ఎస్.ప్. పోలీసులు పరిశీలించినపుడు  నిందితుడి దగ్గర ఎలాంటి పత్రాలు లేవు. ఆ తర్వాత నిందితుడి దగ్గర మూడు పేజీల లేఖ, అది కూడా ముగ్గురి చేతి రాత ఉన్నది ఎలాదొరికిందని? వైస్సార్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే డీజేపీ ఇలా వ్యవహరించారని వారు ఆరోపిస్తున్నారు.

అయితే విశేష ప్రజాధారణ కలిగిన ప్రతిపక్షనేత జగన్ పై జరిగి దాడిని “పెద్దగా చూపితే” వైస్సార్ శ్రేణులు విధ్వంస పూరితమైన ఆందోళనలకు దిగుతారనే అంచనాతో డీజీపీ ఈ తొందరపాటు ప్రకటన చేశారా? అన్న అంశం పరిశీలించినా ఆ అంశంలో నిజం నిర్దారించడానికి ప్రస్తుతం  ఏ మాత్రం అవకాశం మిగల లేదు. ఏది ఏమైనా డీజీపీ ఠాకూర్ పూర్తి విచారణ నిర్వహించకుండా చేసిన తొందరపాటు ప్రకటన ఈ సంఘటనకు రాజకీయ రంగు పులిమి, వివాదాస్పదం చేసిందని చెప్పక తప్పదు.

ఈ ఘటనలో నిజాలు నిగ్గు తేల్చడం ప్రభుత్వ భాద్యతే!

జగన్ పై జరిగిన దాడి ఘటనలో నిజా, నిజాలు నిగ్గు తేల్చడం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ భాద్యతేనని, అలాగే ఇది ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు భాద్యతేనని చెప్పక తప్పదు. రాజ్యాంగ పరంగా ఉన్న భాద్యతతో పాటు, వ్యక్తిగతంగా తనపై వచ్చిన ఆరోపణల్లో నిజా నిజాలు నిగ్గు తేల్చి,ప్రజలకు చెప్పాలి.

అయితే చంద్రబాబు ఆ పని చేయకుండా ఈ సంఘటనను రాజకీయం చేయడానికే ప్రాధాన్యమిచ్చారు. సంఘటన జరిగిన వెంటనే చంద్రబాబుతో పాటు, ఆయన భజన బృందం కూడా ఇది రాజకీయ డ్రామాగా అభివర్ణించడానికే ప్రాధాన్యమిచ్చారు  తప్ప నిజాలు వెలికి తీయడానికి ఏ మాత్రం యత్నించలేదు. జగన్ ఎయిర్ పోర్ట్ నుండి హైదరాబాదుకు నవ్వుతూ రావడం, ఆ తర్వాత వైద్య పరీక్షలకు వెళ్లి, ఆ తర్వాతే దీనికి వైస్సార్ పార్టీ రంగు రుచి కల్పించిందని, అందువల్ల అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయని  టీడీపీ నేతలు సంఘటన ప్రచారానికే ప్రాధాన్యమిచ్చారు తప్ప నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యారు. దీంతో వారు, ప్రభుత్వం, అధినేత అందరు గంపగుత్తగా ప్రజాస్వామ్యవాదుల దృష్టిలో పలుచన అయ్యారు.

దీనికి తోడు జగన్ తనపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర పోలీసులు జరిపే  విచారణపై తనకు నమ్మకం లేదని, అందువల్ల ఈ ఘటనపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ   హైకోర్ట్ లో పిటీషన్ వేసిన తర్వాత చంద్రబాబు రాష్ట్రంలో కేసుల విచారణ కోసం సీబీఐకి ఇచ్చిన సాధారణ అనుమతిని రద్దు చేయడంతో   వైస్సార్ పార్టీ నాయకుల అనుమానాలకు, ఆరోపణలకు కూడా బలం చేకూరింది.

సంఘటన జరిగిన వెంటనే చంద్రబాబు స్పందించి ఈ సంఘటనపై సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నానని ప్రకటించి ఉంటె ఈ వివాదం సద్దుమణిగి ఉండేది. జగన్ కు, వైస్సార్ పార్టీ శ్రేణులకు, ఇతర రాజకీయ పార్టీలకు ఈ సంఘటనను వివాదాస్పదం చేసే వీలు పడేది కాదు. అలాగే  ప్రసారమాధ్యమాలకు కూడా పని తగ్గి ఉండేది.

హత్యా రాజకీయాలకు తానూ పూర్తి వ్యతిరేకమని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోమల్లెల బాబ్జితో  ఆయన పై దాడిని ఎలా చేయించారో? అన్నది జనం మనుసులో తాజాగా మెదులుతున్న ప్రశ్న. అలాగే చంద్రబాబు దృష్టిలో హత్యారాజకీయాలకు ఆద్యుడుగా ఉండి అనేక విధ్వంసకర సంఘటనలకు భాద్యుడుగా ఉన్న       వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి పరిటాల రవి హత్య కేసులో తన కుటుంబంపై ఆరోపణలు వచ్చినపుడు శాసనసభ సాక్షిగా సిబిఐ విచారణకు ఆదేశించిన ప్రామాణికాన్ని ఎందుకు పాటించలేదు? అన్న ప్రశ్నకూ ముఖ్యమంత్రి వద్ద జవాబు లేదు.  జవాబు కూడా ఆయనే చెప్పాల్సి ఉంది.

జగన్ పై జరిగిన దాడి ఘటనను  ఒక సంఘటనగా చూడకుండా అన్ని పార్టీలు, సంస్థలు, ప్రసారమాధ్యమాలు,”తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా” నిజాలకు పాతర వేసే పాపంలో పాలు పంచుకున్నాయి. వీరంతా  తమ తమ వాదాలకు బలం చేకూర్చుకునే ప్రయత్నాలు చేశారు తప్ప నిజమేంటో ప్రజలకు తెలియచేసే అంశానికి ప్రాధాన్యమివ్వలేదని చెప్పక తప్పదు.