పాపం వంగవీటి..రెంటికీ చెడ్డారా ? జగన్ కు మేలే జరిగింది

తమను తాము ఎక్కువగా అంచనా వేసుకుంటే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. గతంలో కూడా చాలామంది ఇలాగే ఎక్కువ అంచనా వేసుకుని బోల్తాపడ్డ ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా వంగవీటి రాధాకృష్ణ కూడా అదే కోవకు చెందేట్లే ఉన్నారు. వైసిపికి  పోయిన నెలలో రాధా రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి ఇప్పటి వరకూ తమ పార్టీలో చేరమని ఏ రాజకీయ పార్టీ కూడా అడగలేదు. పైగా టిడిపిలో చేరుతారని, అధికారంలోకి వస్తే ఎంఎల్సీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని ప్రచారం చక్కర్లు కొట్టింది. పోయిన నెల 26వ తేదీన తెలుగుదేశంపార్టీలో చేరుతున్నట్లు టిడిపి లీకులు కూడా ఇచ్చింది.

అయితే, ఏం జరిగింది ? అంటే ఏమీ జరగలేదనే చెప్పాలి. వైసిపికి రాజీనామా చేసిన రాధాతో జగన్ ను బదనామ్ చేయిద్దామని టిడిపి వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. చంద్రబాబునాయుడు స్క్రిప్ట్ ను చదవటంలో రాధా ఫెయిల్ అయ్యారు. దాంతో రాధాపై చంద్రబాబు అండ్ కో కు బాగా మండిందిట. రాధా ద్వారా జగన్ ను ఏదో చేద్దామని ప్లాన్ వేస్తే బెడిసికొట్టి చివరకు చంద్రబాబు పరువే పోయిందని సమాచారం. విజయవాడ సెంట్రల్లో టిక్కెట్టు దక్కదని తేలిపోయిన తర్వాత రాధా పార్టీ నుండి బయటకు వచ్చేశారు. పోనీ టిడిపిలో దక్కించుకున్నారా అంటే అదీలేదు. టిడిపిలో సిట్టింగ్ ఎంఎల్ఏ ఉన్న కారణంగా సెంట్రల్ టిక్కెట్టు సాధ్యం కాదని చంద్రబాబు తేల్చి చెప్పేశారట. దాంతో రాధా ఏం సాధించినట్లు ?

నిజానికి రాధా పరిస్ధితి ఎలాగుందంటే లేస్తే మనిషిని కాను అన్నట్లుగానే ఉండేది ఇంతకాలం. ఏదో తండ్రి వంగవీటి  మోహన రంగ పేరు చెప్పుకుని బ్రతికిపోతున్నారు. నిజంగానే తండ్రికి తగ్గ వారుసుడయ్యుంటే మూడుసార్లు పోటీ చేస్తే గెలిచింది ఒక్కసారి. విజయవాడ సిటీపై రాధాకు నిజంగానే అంత పట్టుంటే వరుసగా రెండుసార్లు ఎందుకు ఓడిపోతారు ? రాధా రాజకీయ నేపధ్యం చూస్తేనే ప్రతీ ఎన్నికకు ఒక పార్టీ మారుస్తారనే విషయం అర్ధమవుతుంది.

2004లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. తర్వాత 2009లో పిఆర్పీలో చేరి ఓడిపోయారు. మళ్ళీ 2014లో వైసిపి తరపున పోటీచేసి ఓడిపోయారు. మరి రేపటి ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేస్తారు ? ఇప్పటికైతే ఆ విషయంలో రాధాకు కూడా క్లారిటీ ఉన్నట్లు లేదు. టిడిపిలో చేరేది అనుమానమే అంటున్నారు. అదే సందర్భంలో జనసేన నుండి కూడా పిలుపొచ్చినట్లు కనబడటం లేదు. పైగా ఆంక్షలు లేని ప్రయాణం చేస్తానని చెప్పిన తర్వాత ఏ రాజకీయ పార్టీలోను రాధా ఇమడలేరన్న విషయం తెలిసిపోతోంది. అందుకనే దారినపోయే చెత్తను మన నెత్తినెందుకేసుకోవాలి అనే ఏ పార్టీ కూడా రాధాను ఆహ్వానిస్తున్నట్లు లేదు. మొత్తానికి వైసిపి నుండి బయటకు వచ్చేసిన రాధా జగన్ కు మేలు చేశారనే చెప్పాలి.