ఆనందయ్య నాటు మందుకి వైసీపీ రంగేస్తారా.? టీడీపీ రంగేస్తారా.?

Political Colors On Anandayya Natu Mandu

Political Colors On Anandayya Natu Mandu

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్న చందాన ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కుల, మత, వర్గ రాజకీయాలు నడుస్తున్నాయి. రంగుల పేరుతో నడిచే రాజకీయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కరోనా వ్యాక్సిన్ మీద కూడా ‘పచ్చ’ రంగేసిన ఘనులు ఆంధ్రపదేశ్ రాజకీయ నాయకులు. కోవాగ్జిన్.. కమ్మ వ్యాక్సిన్ అయ్యింది కొందరికి. కోవిషీల్డ్.. రెడ్డి వ్యాక్సిన్ అయ్యింది ఇంకొందరికి. ఇప్పుడు, ఆనందయ్య నాటు మందు చుట్టూ కూడా ఇవే రాజకీయాలు నడుస్తున్నాయి.

ఆనందయ్య నాటు మందుకి త్వరగా అనుమతులు ఇవ్వాలంటూ టీడీపీ చేసిన యాగీ అంతా ఇంతా కాదు. టీడీపీ పోరాటం వల్లే ఆనందయ్య నాటు మందుకి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటూ తెలుగు తమ్ముళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. మరోపక్క, ఆనందయ్యను తమవైపుకు తిప్పుకుని వైసీపీ, ఆ నాటు మందుకి ‘బులుగు రంగు’ (రాజకీయ రంగు) అద్దుతున్నారని అదే తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. ‘కోవాగ్జిన్ మీద కమ్మ ముద్ర, పసుపు ముద్ర వేశారు కదా.. ఆ వ్యాక్సిన్ వైసీపీ నేతలెవరూ తీసుకోకూడదు..’ అంటూ తెలుగు తమ్ముళ్ళు గతంలో సెటైర్లేశారు.

మరిప్పుడు, ఆనందయ్య నాటు మందుని టీడీపీ మద్దతుదారులు తీసుకోకుండా వుంటారా.? ఈ స్థాయి నీఛమైన రాజకీయం బహుశా దేశంలో ఇంకే రాష్ట్రంలోనూ వుండదేమో. మరోపక్క, ఆనందయ్య నాటు మందు తయారీ ప్రక్రియ మొదలైంది. కొరియర్ సర్వీసుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆనందయ్య నాటు మందు వల్ల దుష్ప్రభావాల్లేవు అని నివేదికలు తేల్చిన దరిమిలా.. ఈ మందు చుట్టూ ఇకనైనా రాజకీయాలు ఆగుతాయేమో వేచి చూడాలి.