పొలిటికల్ ‘భీమ్లానాయక్’కి ఏడాది.!

‘భీమ్లానాయక్’ సినిమా గుర్తుంది కదా.? గత ఏడాది విడుదలైందీ సినిమా. సినిమాలో కంటెంట్ ఎంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘భీమ్లానాయక్’ సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ఆనాటి ఆ ప్రకంపనల్ని మళ్ళీ ఇప్పుడు తీరిగ్గా గుర్తు చేసుకుంటున్నారు ఇటు జనసైనికులు, అటు వైసీపీ కార్యకర్తలు.

సోషల్ మీడియా వేదికగా వైసీపీ వర్సెస్ జనసేన.. ‘భీమ్లానాయక్’ విషయంలో ఇంకోసారి గట్టిగా జరుగుతోంది. ‘భీమ్లానాయక్’ వసూళ్ళ గురించీ, ఆ సినిమా చుట్టూ నడిచిన రాజకీయాల గురించీ సోషల్ మీడియా వేదికగా జనసేన మద్దతుదారులు, వైసీపీ మద్దతుదారులు కొట్టుకుంటున్నారనడం అతిశయోక్తి కాదేమో.

మలయాళ సినిమా ‘అయ్యప్పనుం కోషియమ్’కి తెలుగు రీమేక్ ‘భీమ్లానాయక్’. సినిమాలో కొన్ని డైలాగులు, ఏపీ రాజకీయాల్ని ఉద్దేశించి బలవంతంగా పెట్టారన్న విమర్శలూ లేకపోలేదు. కారణాలేవైతేనేం, ఏపీలోని అధికార వైసీపీ, ‘భీమ్లానాయక్’ సినిమాకి అడ్డంకులు కల్పించింది. టిక్కెట్ల ధరల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. ఈ క్రమంలో జరిగిన రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. మంత్రులు మీడియా ముందుకొచ్చి, ఓ సినిమా గురించి మాట్లాడటం.. రాజకీయాల్లో అంతకు ముందెన్నడూ లేదన్నది నిర్వివాదాంశం. ఆ ప్రకంపనలు ఇప్పటికీ కొనసాగుతూనే వున్నాయి.

ఇంతలోనే ‘భీమ్లానాయక్’ సినిమాకి ఏడాది పూర్తయిపోయింది. సోషల్ మీడియాలో నడుస్తున్న వైసీపీ వర్సెస్ జనసేన వార్ కాస్తా, ఓటీటీలో ‘భీమ్లానాయక్’ సినిమాకి అడ్వాంటేజ్ అవుతోందన్న వాదనా లేకపోలేదు. సినిమా వేరు, రాజకీయం వేరు.. అనడానికి వీల్లేదు. సినిమా – రాజకీయం..రెండూ ఒకటే ఇప్పుడు.! అది ‘భీమ్లానాయక్’తో నిరూపితమయ్యింది.