తెలుగుదేశంలోని కొందరు ముఖ్య నేతలు ఇప్పటికే పలు కేసుల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈఎస్ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడు అరెస్టయితే మరొక కీలక నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీద హత్యాయత్నం కేసు నమోదైంది. మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్, వైకాపా నేత మోకా భాస్కరరావు హత్య కాబడ్డారు. ఆ కేసులో మోకా బంధువులు ఇచ్చిన పిర్యాధులో అనుమానితుడిగా కొల్లు రవీంద్ర పేరు కూడా ఉంది. దీంతో పోలీసులు ఆయన్ను వెతికి మరీ పట్టుకుని విచారణకు తీసుకెళ్లారు. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. కావాలనే తమను ఇలా అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడిపోయారు. ఇక తాజాగా కూడ కొల్లు రవీంద్రకు మంత్రి పేర్ని నాని మీద జరిగిన తాపి దాడి కేసులో నోటీసులు వెళ్లాయి.
పేర్ని నాని అనుచరుడిగా చెప్పబడుతున్న వ్యక్తి నాని ఇంట్లోనే ఆయనపై దాడికి యత్నించాడు. అతన్ని అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో రెండు రోజులు రిమాండ్లో ఉంచారు. ఇప్పటికే నిందితుడి వాంగ్మూలం ఆధారంగా విచారణ చేస్తున్నారు. అతని కాల్ డేటా కూడా పరిశీలించారు. టీడీపీకి సంబంధించిన సానుభూతి పరులకు నాగేశ్వరరావు ఫోన్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు నాగేశ్వర రావు సోదరి ఉమాదేవి కూడా టీడీపీలో పని చేస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రి మీద దాడి జరిగిన రోజునే అది టీడీపీ నేతల పని అనే విమర్శలు మొదలుపెట్టారు వైకాపా నేతలు.
అప్పుడే కొల్లు రవీంద్ర పేరు తెరమీదకు వచ్చింది. దాంతో స్పందించిన ఆయన ఇసుక పాలసీ మూలాన ఇసుక దొరక్క పనులు లేక కోపంలో ఉండి తాపి మేస్త్రి దాడికి యత్నించి ఉంటాడని, అనవసరంగా ఇందులోకి టీడీపీ నేతల పేర్లను ఇరికిస్తున్నారని మాట్లాడారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో కొల్లు రవీంద్రకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని సెక్షన్ 91 కింద రవీంద్రకు నోటీసులు ఇచ్చారు. దీంతో టీడీపీ నేతల్లో అలజడి మొదలైంది. నిజానికి కొల్లు రవీంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద ఇలాంటి అభియోగాలు ఎప్పుడూ రాలేదు. అలాంటిది అయన పదవిలో, టీడీపీ అధికారంలో లేని సమయంలో ఆయన మీద ఇలా వరుస అభియోగాలు రావడం, అందులోనూ హత్యాయత్నం, హత్య కేసుల్లో కావడం జనాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
కొందరైతే వైసీపీ నేతల మీద దాడులు జరిగితే వెంటనే కొల్లు రవీంద్రను అనుమానించడం, అరెస్ట్ చేయడం లేకపోతే ఆయన ఏదైనా మాట్లాడితే అలా నోటీసులు పంపడం చూస్తుంటే ఇకపై అధికార పార్టీ లీడర్లకు, వారి అనుచరులకు ఏం జరిగినా రవీంద్రనే టార్గెట్ చేస్తారేమో అనుకుంటున్నారు. నిజానికి తమ మీదపడి నిందలను, ఆరోపణలను డిఫెన్స్ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరూ చేస్తారు. కొల్లు రవీంద్ర కూడ అదే చేశారు. దానికే ఆయనకు నోటీసులు పంపడం, విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామని తెలిపడం పలు అనుమానాలకు తావిస్తోంది.