విశాఖపట్నం యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుపై కేసు ఫైల్ అయింది. ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిని బెదిరించారని ఆరోపణలతో రాంబిల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఎమ్మెల్యేతో పాటూ అతని అనుచరుడు డీఎస్ ఎం రాజుపై ఐపీసీ 506,171ఎఫ్ తో పాటుగా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కేసు నమోదు అయ్యింది. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థి అల్లుడిని కన్నబాబు రాజు ఫోన్లో బెదిరించిన ఆడియో టేప్ దుమారం రేపింది.
విశాఖజిల్లా రాంబిల్లి మండలం లాలంకోడూరు పంచాయతీ శివారు సీతాపాలెంకు లాలం సంతోష్ సొంత మామ లాలంకోడూరు పంచాయతీ వార్డు సభ్యుడిగా వైఎస్సార్‌సీపీ రెబల్‌గా నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే కన్నబాబు రంగలోకి దిగి నామినేషన్ విత్‌డ్రా చేయించాలని ఫోన్‌లో సంతోష్‌పై బెదిరింపులకు దిగారు. ఈ సంభాషణ రికార్డు చేసిన బాధితుడు రాంబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నామినేషన్ విత్‌డ్రా చేయించకపోతే జైలుకు పంపిస్తానని ఎమ్మెల్యే బెదిరించాడని బాధితుడు ఫిర్యాదులో పొందుపరిచాడు. ఈ మేరకు ఆడియో రికార్డును పోలీసులకు అందజేశారు. దీంతో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే తానేవరినీ బెదిరించలేదని ఎమ్మెల్యే కన్నబాబురాజు అంటున్నారు. గతంలో ఎప్పుడో మాట్లాడిన వాటిని కలిపి మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. ఏకగ్రీవమైతే గ్రామాభివృద్ధికి బావుంటుందని సూచించాను అన్నారు. కొంత మంది పోటీదారులను డిస్‌క్వాలిఫై చేయించాన్న ఆరోపణలు అవాస్తవం అన్నారు. నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.