అవును నిజంగానే విశాఖపట్నం పోలీసు కమీషనర్ మహేష్ చంద్ర లడ్డా ముఖ్యమంత్రికి షాకిచ్చారు. విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ముమ్మాటికి హత్యాయత్నమే అని ఈరోజు ప్రకటించారు. తాజాగా విశాఖ కమీషనర్ చేసిన ప్రకటనతో చంద్రబాబుకు దిమ్మ తిరగటం ఖాయం. ఎందుకంటే, జగన్ పై దాడి అంతా నాటకమని మొదటి నుండి చంద్రబాబు అండ్ కో చెబుతుంటే అందుకు భిన్నంగా కమీషనర్ చెప్పటమే విచిత్రం. పైగా జగన్ పై హత్యాయత్నం కేసు హై కోర్టులో విచారణలో ఉంది. జగన్ పై దాడి జరగ్గానే జరిగింది అంతా నాటకమని చెప్పిన చంద్రబాబు విచారణ పేరుతో సిట్ ను ఏర్పాటు చేశారు.
దాడి విషయంలో ముందే చంద్రబాబు, డిజిపి, మంత్రులు ఓ నిర్ణయానికి వచ్చేసిన కారణంగా సిట్ విచారణలో తనకు న్యాయం జరగదన్న అనుమానంతో జగన్ థర్డ్ పార్టీ విచారణ కోరుతూ హై కోర్టులో పిటీషన్ వేశారు. సరే, ఆ కేసును కోర్టు విచారిస్తోందనుకోండి అది వేరే సంగతి. ఆ కేసుపై 4వ తేదీన విచారణ జరగబోతోంది. ఇటువంటి సమయంలో విశాఖ కమీషనర్ హఠాత్తుగా ఓ ప్రకటన చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యావత్ ప్రభుత్వ యంత్రాంగమంతా దాడిని నాటకంగా నిరూపించేందుకు నానా అవస్తలు పడిన విషయం అందరూ చూసిందే.
ఈ విషయాలన్నీ తెలిసి కూడా జగన్ పై దాడి కచ్చితంగా హత్యాయత్నమే అని లడ్డా చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇంతకాలం చంద్రబాబు అండ్ కో తో పాటు డిజిపి చెప్పింది అబద్దమే అని లడ్డా తాజా ప్రకటనతో తేలిపోయింది. అక్టోబర్ 23న హత్యాయత్నం జరిగింది. కానీ లడ్డా సమాచారం ప్రకారం అంతకు వారం క్రితమే ప్లాన్ చేశాడట నిందితుడు శ్రీనివాస్. అయితే, 18వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోవాల్సిన జగన్ ఒకరోజు ముందే అంటే 17వ తేదీనే విశాఖ నుండి విమానంలో హైదరాబాద్ కు వచ్చేయటంతో ప్లాన్ అమలు చేయలేకపోయాడట. అందుకనే తర్వాత 23వ తేదీన ప్లాన్ పక్కాగా అమలు చేయాలని ప్లాన్ చేసినట్లు తెలిసిందని లడ్డా చెప్పారు. మొత్తానికి లడ్డా తాజా ప్రకటనతో చంద్రబాబుకు షాక్ కొట్టటం ఖాయమే.